ఉమ్మడి మహబూబ్ నాగర్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి భూములను సస్యశ్యామలం చేస్తామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం గట్టు ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును పరిశీలించడానికి రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి వచ్చిన మంత్రులకు స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి గట్టు ఎత్తిపోతల పథకం పనులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, ఉమ్మడి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఓసారి ఎంపీగా వరుసగా ఎన్నికై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా మంత్రిగా పనిచేసి జిల్లాపై పూర్తి అవగాహన ఉందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి మహబూబ్ నాగర్ జిల్లా ఇన్చార్జిగా ఉండి అప్పుడు కూడా ఈ ప్రాజెక్టులును పర్యటించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వంలో అందరం కూడా ఉమ్మడి మహబూబ్ నాగర్ జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్ట్ లకు ఎంత వీలైతే అంత పనులను చేపట్టి పూర్తి చేయించాలని ఉద్దేశంతో ముందుకు పోతున్నామని తెలిపారు. ఈరోజు కూడా ప్రత్యేకంగా జిల్లా మంత్రి, ఎంపీ, మరి ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్, రాష్ట్ర ఫైనాన్స్, ఇరిగేషన్ శాఖల అధిపతులతో కలసి క్షేత్రస్థాయిలో విషయాన్ని అవగాహన చేసుకుని పనులు వేగవంతం చేసి, కొత్త పనులు మంజూరు ఇవ్వడానికి బయలుదేరామని తెలిపారు.
పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్ పెండింగ్ లో ఉన్న పనులను గట్టు ప్రాజెక్టు పనులన్నింటినీ తూచా తప్పకుండా ప్రభుత్వం పూర్తి చేయడానికి కట్టుబడి పనిచేస్తామని తెలిపారు. రేలంపాడుకి రిజర్వాయర్ కెపాసిటీ పెంచడానికి, లీకులు మరమత్తులు చేసేందుకు తప్పనిసరిగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పూర్తి చేస్తామని అన్నారు. 10 టిఎంసి పైన పెంచడానికి అదనపు స్టోరేజ్ కెపాసిటీ సృష్టించడానికి ఆర్ధిక వనరులను చూసుకొని డి పి ఆర్ సిద్ధం చేసి ముఖ్యమంత్రి ఆమోదంతో పనులు చేపడుతామని తెలిపారు. ఆలంపూర్ లో ఆర్డీఎస్ విషయం అదే విధంగా మల్లమ్మ కుంట రిజర్వాయర్ విషయంలో కూడా తప్పనిసరిగా చర్యలు చేపడతామన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గల ప్రాజెక్టులన్ని
చిత్తశుద్ధితో వచ్చే మూడు నాలుగు సంవత్సరాలలో పనులన్నింటినీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణానది ప్రారంభం నుండి జూరాల ప్రాజెక్టు వరకు ఉమ్మడి జిల్లా జూరాలపై ఆధారపడి ఉందని అన్నారు. జూరాలపై రెండు లక్షలు నెట్టెంపాడు పై రెండు లక్షలు బీమా ప్రాజెక్టు పై రెండు లక్షలు మొత్తం ఆరు లక్షల ఎకరాలు జురాల కెపాసిటీ ఉండగా వర్షాకాలంలో రెండు నెలలలో రిజర్వాయర్ నిండని సమయంలో నీటి కరువు ఏర్పడుతుందని, అందుకొరకు గట్టు ఎత్తిపోతల లాంటి పథకాలు చేపట్టి పూర్తి చేసి సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. కర్ణాటక పై ఆధారపడకుండా అన్ని ప్రాజెక్టులకు నీరు ఇచ్చే విధంగా కృషి చేస్తామని అన్నారు. మన జిల్లా వాసి అయిన ముఖ్యమంత్రి ఉమ్మడి జిల్లా ప్రాజెక్టుల పూర్తి కొరకు కృషి చేస్తారని తెలిపారు. నాగర్ కర్నూల్ ఎంపీ మల్లురవి మాట్లాడుతూ, గట్టు ఎత్తిపోతల పథకం పనులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి త్వరగా పూర్తి చేయించేలా కృషి చేస్తామని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని ప్రాజెక్టులను పూర్తిచేసి సస్యశ్యామలం చేస్తామని అన్నారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ, గట్టు ఎత్తిపోతల పథకం1.36 టీ ఎం సి లతో రూపొందించబడిందని ప్రస్తుతం జూరాల పై ఆధారపడకుండా గట్టు ఎత్తిపోతల పథకాలను విస్తరించి నీటి నిల్వ చేయడం ద్వారా తెలంగాణ కర్ణాటక ప్రాంతాలకు కూడా సాగునీరు అందించే అవకాశం ఉందని అన్నారు. నూతన టెక్నాలజీతో గట్టు ఎత్తిపోతల పథకంలో 15 టిఎంసిల నుండి 25 టిఎంసిల వరకు నీటిని నిలువ చేసేందుకు ఇంజనీరింగ్ అధికారులు తగు ప్రణాళిక సిద్ధం చేస్తారని తెలిపారు. అలాగే ర్యాలంపాడు రిజర్వాయర్ రెండు టీఎంసీల నుండి నాలుగు టిఎంసిలకు పెంచేందుకు వచ్చే ఏడాది వరకు పనులు పూర్తిచేసేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. రెండు టీఎంసీలు నుండి నాలుగు టిఎంసిల నీటి నిలువ జరిగితే రెండవ పంటకు కూడా అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు, ఇరిగేషన్ ఆర్థిక శాఖ, రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణారావు, ఈ ఎన్ సి అనిల్, అదనపు కలెక్టర్లు నరసింగరావు, శ్రీనివాసరావు, ఆర్డీవో రామచందర్, ఇరిగేషన్ ఈఈ రహీముద్దీన్, తదితరులు పాల్గొన్నారు.