
చర్లపల్లి టెర్మినల్ స్టేషన్‌లో ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి
‘వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్’ స్టాల్ కేటాయింపు
చర్లపల్లి టెర్మినల్ స్టేషన్‌లో ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ సభ్యులకు ‘వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్’ స్టాల్ మరియు ట్రాలీ స్టాండ్ కేటాయించబడింది. ఈ స్టాల్‌ను ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు నిర్వహిస్తారు. ఈ స్టాల్‌లో స్నాక్స్, జూట్ బ్యాగ్‌లు, సబ్బులు మరియు అనేక రకాల చేతితో తయారు చేసిన ఉత్పత్తులను విక్రయానికి అందుబాటులో ఉంచడం జరిగింది.
జాస్మిన్ (ట్రాన్స్‌జెండర్ ఎంటర్‌ప్రెన్యూర్) ‘వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్’ స్టాల్‌ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ, ” ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ చాలా కాలంగా, ఉద్యోగ అవకాశాల కొరతను ఎదుర్కొంటోంది. కానీ ఇప్పుడు, మేము మా స్వంత వెంచర్‌లను ప్రారంభించడానికి కలిసి వచ్చాము. కొత్తగా ప్రారంభించబడిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్‌లో మాకు ఒక స్టాల్ మరియు ట్రాలీ స్టాండ్ ఇవ్వబడింది. తద్వారా మా యొక్క చేతి వృత్తుల నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి అవకాశం కలిగినట్లయింది. మేము మా స్టాల్‌లో, మా సంఘంలోని సభ్యుల ఉత్పత్తుల శ్రేణిని కొనుగోలుదార్లకు అందిస్తాము.
నేను చిరుతినుబండరాల వ్యాపారాన్ని నడుపుతున్నాను, నేను స్వయంగా తయారుచేసే క్రిస్పీ ట్రీట్‌లను విక్రయిస్తాను. త్రిపుర మరియు సహస్ర అనే ఇద్దరు ప్రతిభావంతులైన ట్రాన్స్ వుమెన్ లు ప్రత్యేకించి చేతితో తయారు చేసిన జనపనార సంచులను ఇక్కడ విక్రయిస్తారు. ఇక్కడ ప్రతి ఒక్క ఉత్పత్తి ప్రత్యేకమైనదే కాకుండా ఇది మా మనోబలాన్ని మరియు సృజనాత్మకతను పెంపొందిస్తుంది. కిరణ్ రాజ్ అనే ట్రాన్స్ మ్యాన్ సబ్బులు తయారు చేస్తాడు మరియు మా స్టాల్‌లో అతని సబ్బులను అమ్మకానికి ఉంచినందుకు నేను సంతోషంగా ఉన్నాను.
చర్లపల్లి రైల్వే టెర్మినల్‌లో మా కోసం ఈ ప్రత్యేక స్టాల్ ఉండడంమాకు కల్పించిన ఒక గొప్ప అవకాశం. తద్వారా మేము ప్రజలతో మమేకం కావడానికి మరియు మా సామర్ధ్యాన్ని ప్రజలు గుర్తించేందుకు ఇది ఒక సదావకాశంగా భావిస్తాం. ఈ స్టాల్ మరియు ట్రాలీ మా కమ్యూనిటి పురోగతికి మరియు సమానత్వ గుర్తింపుకు చిహ్నాలు.
దీని కోసం నేను రైల్వే అధికారులకు, రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను మరియు భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను ఆశిస్తున్నాము. ఇది ప్రారంభం మాత్రమే, తదుపరి ఏమి జరుగుతుందనే దాని కోసం మేము సంతోషిస్తున్నాము. ప్రతి అడుగు మనం ఎంత దూరం వచ్చామో గుర్తుచేస్తుంది మరియు నేను మంచి భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్నాను.” అని జాస్మిన్ చెప్పారు.
వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ వినూత్న చొరవ సమాజంలోని అణగారిన వర్గాలకు మార్కెట్‌ను అందించడం మరియు అదనపు ఆదాయ అవకాశాలను సృష్టించడం ద్వారా స్థానిక/స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. 2022-23 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన ఈ భావనకు స్థానిక ప్రజల నుండి అపారమైన స్పందన లభించింది మరియు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని 77 స్టేషన్లు మరియు ఆంధ్రప్రదేశ్‌లోని 104 స్టేషన్లతో కలుపుకొని మొత్తంగా 223 ‘ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి’స్టాళ్లు దక్షిణ మధ్య రైల్వే జోన్‌లోని దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో 205 రైల్వే స్టేషన్లలో నిర్వహించబడుతున్నాయి
వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ విధానంలో నిర్దేశించిన ప్రకారం, రైల్వే అధికారులు లక్ష్య సమూహాలను చేరుకోవడానికి మరియు దరఖాస్తుదారులందరికీ అవకాశం కల్పించడానికి వివిధ చర్యలను అనుసరించారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి, వార్తాపత్రికలలో ప్రకటనలు, సోషల్ మీడియా, ప్రజా ప్రకటనలు, పత్రికా ప్రకటనలు, చేతివృత్తులవారిని సందర్శించడం వంటి వివిధ ప్రజా చేరువ చర్యలు చేపట్టబడ్డాయి.
దక్షిణ మధ్య రైల్వే జోన్ సమాజంలోని అన్ని వర్గాల వారి సృజనాత్మకత మరియు ప్రతిభను ప్రదర్శించడానికి ఒక సరైన వేదిక మరియు సమాన అవకాశాలను అందించడానికి కట్టుబడి ఉందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. చర్లపల్లి టెర్మినల్ స్టేషన్‌లో ఓఎస్‌ఓపీ స్టాల్‌ను నిర్వహించే అవకాశం ట్రాన్స్‌జెండర్లకు లభించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ స్టాల్ స్వయం సహాయక సంఘాలు, సామాజిక పారిశ్రామికవేత్తలకు మాత్రమే కాకుండా ప్రయాణీకుల అవసరాలకు కూడా ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.