*చర్లపల్లి రైల్వే టెర్మినల్ మహానగరం సిగలో మరో మణిహారం కానుంది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా సుమారు రూ.430 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ టెర్మినల్ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది.*
*ఈనెల 28న రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, మరో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించనున్నారు.*
*ఆధునిక సౌకర్యాలతో..!!!*
ఈ స్టేషన్ భవనంలో ఆరు ఎస్కలేటర్లు, ఏడు లిఫ్ట్‌లు, ఆరు బుకింగ్ కౌంటర్లు, పురుషులు, మహిళలకు వేర్వేరు వెయిటింగ్ హాళ్లు, హైక్లాస్ వెయిటింగ్ ఏరియా, గ్రౌండ్ ఫ్లోర్‌లో ఎగ్జిక్యూటివ్ లాంజ్ ఉంది. మొదటి అంతస్తులో కెఫెటేరియా, రెస్టారెంట్, రెస్ట్‌రూమ్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు. కొత్త డిజైన్‌లో ప్రయాణికుల రాకపోకలకు విశాలమైన స్థలం (కాన్కోర్స్), ముందువైపు ప్రకాశవంతమైన లైటింగ్‌తో ఆధునిక ఎలివేషన్‌ను తీర్చిదిద్దారు. ప్రయాణికులకు ఉచిత వైఫై సదుపాయం కల్పించనున్నారు. హైదరాబాద్ శివారులోని ఈ టెర్మినల్ అందుబాటులోకి వచ్చాక.. *పలు రైళ్లు ఇక్కడి నుంచే ప్రారంభం కానున్నాయి.* తద్వారా జంటనగరాల్లోని ప్రధాన రైల్వేస్టేషన్లపై ఒత్తిడి తగ్గించాలనేది రైల్వే శాఖ లక్ష్యం. ఈ టెర్మినల్ అందుబాటులోకి వచ్చాక నగరంలోని నాంపల్లి, కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లపై ప్రయాణికుల ఒత్తిడి గణనీయంగా తగ్గిపోనుంది. ఇక్కడి నుంచే నగరం నలుమూలలకు ప్రయాణికులు సులువుగా చేరుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే నడుస్తున్న రైళ్లకు అదనంగా కొత్తగా మరో 25 జతల రైళ్లు ఇక్కడి నుంచి పరుగుల తీయనున్నాయి. లక్షల్లో ప్రయాణికులు రాకపోకలు సాగించనున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజారవాణా వ్యవస్థను మెరుగు పరిచేందుకు చర్యలు చేపట్టింది.