*నాలాలపై హైడ్రా ఫోకస్* *అక్రమాల పై డ్రోన్ సర్వే షురూ*
= *తొలి దశగా బల్కాపూర్ నాలాపై టోలిచౌకీ, షేక్ పేటల్లో*
= త్వరలో అయిదు మేజర్ నాలాలపై సర్వేకు హైడ్రా సన్నాహాలు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ట్రై సిటీల్లో సర్కారు ఆస్తులు , చెరువులు, కుంటల పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా ఏర్పడిన హైడ్రా ఇపుడు నాలాలపై దృష్టి పెట్టింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 390 కిలోమీటర్ల పొడువున ప్రవహించే అయిదు ప్రధాన నాలాలపై డ్రోన్ సర్వేను హైడ్రా చేపట్టింది. మొత్తం జి హెచ్ ఎం సి వ్యాప్తంగా 1302 కిలోమీటర్ల మురుగు కాల్వ కలదు. ఇప్పటికే నేషనల్ రిమోట్ సెన్సింగ్ నిర్వహించిన ఓ సర్వేలో నగరంలో ని అయిదు ప్రధాన నాలాలతో పాటు మరో 22 చిన్న, మధ్య తరహా నాలాలు సుమారు వెయ్యి కిలోమీటర్ల పొడువున ప్రవహిస్తున్నాయి. వీటిల్లో ఇప్పటి వరకు గడిచిన 45 సంవత్సరాల్లో చెరువులు 61 శాతం కబ్జాల పాలైనట్లు తేల్చిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ అథారిటీ సర్వే కూడా వెయ్యి కిలోమీటర్ల పొడువున ప్రవహించే నాలాలపై సుమారు 50 వేల ఆక్రమణలు వచ్చినట్లు తేల్చింది. ఇపుడు హైడ్రా నిర్వహిస్తున్న డ్రోన్ సర్వేతో నాలాలపై ఏ రకమైన ఆక్రమణలు వచ్చాయన్న విషయాన్ని హైడ్రా తేల్చనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఎఫ్ టీఎల్, బఫర్ జోన్లలో నిర్మించిన నివాయోగ్యమైన నిర్మాణాలను కూల్చేది లేదన్న విషయాన్ని ప్రకటించిన హైడ్రా ఇపుడు నాలాలపై వెలసిన ఆక్రమణల్లో నివాసయోగ్యమైన ఆక్రమణలెన్ని? వ్యాపార కార్యకలాపాలు చేస్తున్న ఆక్రణలెన్నీ? వీటిల్లో రెవెన్యూ శాఖ పట్టాలు జారీ చేసిన ఆక్రమణలను కూడా గుర్తించినట్లు సమాచారం.
వీటిల్లో అయిదు మేజర్ నాలాల్లో అతి పెద్ద నాలా అయిన బల్కాపూర్ నాలాపై గడిచిన 30 ఏళ్లలో వెలసిన ఆక్రమణలను గుర్తించేందుకు ఇటీవలి కాలంలో వేగంగా పట్టణీకరణ వచ్చిన షెక్ పేట, టోలీచౌకీ ప్రాంతాల్లో శుక్రవారం నుంచి హైడ్రా డ్రోన్ సర్వే ను ప్రారంభించింది. ఈ సర్వే ప్రకారం రెవెన్యూ శాఖ జారీ చేసిన పట్టాలున్న ఆక్రమణదారులకు ప్రత్యామ్నాయ పునరావసం కల్పించిన తర్వాతే వారి నివాసాలను తొలగించాలని హైడ్రా భావిస్తున్నట్లు సమాచారం. తాజాగ నిర్వహిస్తున్న డ్రోన్ సర్వేలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆక్రమణలను గుర్తించి, వెంటనే తొలగించాలని కూడా హైడ్రా భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
నాలుగు రోజులు ముమ్మర సర్వే
నేటి (శనివారం) నుంచి వరుసగా సెలవులు రావటం, పైగా 17వ తేదీన వినాయక నిమజ్జనం ఉండటంతో పోలీసులంతా నిమజ్జన డ్యుటీల్లో ఉన్నందున ఈ నాలుగు రోజుల పాటు ఎలాంటి కూల్చివేతలు చేపట్టకుండా, నాలాలపై ముమ్మరంగా సర్వే నిర్వహించాలని హైడ్రా నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నాలుగు రోజుల పాటు బల్కాపూర్ నాలాపై వెలసిన ఆక్రమణలను గుర్తించటంలో హైడ్రా ఓ నిర్ణయానికి వచ్చిన తర్వాతే తదుపరి కూల్చి వేతలు చేపట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. నాలాల ఆక్రమణలపై ఇప్పటికే ఉక్కుపాదం మోపాలని భావిస్తున్న హైడ్రా ఈ సర్వేలో మూడు దశాబ్దాల క్రితం ఉన్న నాలా వెడల్పు, ఇపుడునన్న వెడల్పు, గడిచిన 30 ఏళ్లలో వచ్చిన ఆక్రమణలను గుర్తించి పకడ్బందీగా ఓ నివేదికను తయారు చేసి, ఆక్రమణలకు సంబంధించి పక్కా ఆధారాలను సేకరించిన తర్వాతే కూల్చి వేతలకు వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం.