అందుకే ప్రజావాణి కి క్యూ కడుతున్న ప్రజలు.!
మున్సిపాలిటీకి ఫిర్యాదు చేస్తే చెత్తబుట్టలోనే.?
అందుకే ప్రజావాణికి క్యూ కడుతున్న ప్రజలు.!
ఆదిలాబాద్, సెప్టెంబర్ 15 (సమయం న్యూస్): ఆదిలాబాద్ పట్టణంలోని తాటిగూడ కాలనీ.. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా నీటిని అందజేస్తున్నామని గొప్పలు చెప్పుకున్న గత బీఆర్ఎస్ ప్రభుత్వం, రాజకీయ, స్థానిక నేతల ఒత్తిళ్లతో 2017లో ఒక మినీ వాటర్ ట్యాంక్ ను ఏర్పాటు చేసింది. అయితే ఆ ట్యాంక్ దగ్గరే బట్టలు ఉతకడం, అంట్లు తోమడం, స్నానాలు చేయడం లాంటి పనులు చేయడం వల్ల మురుగు నీరు నిలిచి.. దోమలు వృద్ధి చెంది.. రోగాలు ప్రబలుతున్నాయి. దీంతో ఒకసారి మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయగా, పట్టించుకోలేదు. ఆ తర్వాత ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగం అధికారులు అక్కడ విచారణ చేపట్టారు. ఈ వాటర్ ట్యాంక్ మంజూరైన చోటున కాకుండా మరో చోట పెట్టారని, బట్టలు ఉతకం, అంట్లు తోమడం వల్ల పలువురికి అసౌకర్యంగా ఉందని, అంతేకాకుండా దీని నిర్వహణ మున్సిపాలిటీకి భారంగా మారిందని, నల్లాల ద్వారా ఇంటింటికి నీళ్లు సరఫరా చేస్తున్న సమయంలో అసలు ఆ ట్యాంక్ అవసరమే లేదని తేల్చి రిపోర్ట్ రాశారు. అంతగా అవసరమనుకుంటే ఆ ట్యాంక్ ను మంజూరు చేయబడిన ప్రాంతానికి మార్చాలని, లేకుంటే డిస్మెంటల్ చేయాలని స్పష్టంగా చెప్పారు. అయితే మున్సిపల్ కమిషనర్ తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
-ఆదిలాబాద్ పట్టణంలోని రిక్షాకాలనీకి చెందిన పొలీస్ డిపార్ట్ మెంట్ లో కీలక స్థానంలో ఉన్న ఓ వ్యక్తి పక్కనే ఉన్న ఓ డ్రైవర్ స్థలాన్ని ఆక్రమించి, వెనక ఉన్న నాలా బఫర్ జోన్ లోనూ నిర్మాణం చేపడుతున్నాడు. దీనిపై కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తే నెలల సమయం తీసుకున్న మున్సిపల్ అధికారులు విచారణ చేపట్టి డ్రైవర్ స్థలాన్ని సదరు పొలీస్ డిపార్ట్ మెంట్ వ్యక్తి కబ్జా చేశాడని నిర్ధారించారు. అంతేకాకుండా అతడు చేపడుతున్న నిర్మాణం నిబంధనలకు విరుద్ధమని తేల్చి షోకాజ్ నోటీస్ సైతం జారీ చేశారు. అంతకుముందు అతడిపై పొలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. అయితే దీనికి బాధితుడు 20కి పైగా అర్జీలు ఇవ్వాల్సి వచ్చింది. అయినా పేపర్ వర్క్ కు మాత్రమే పరిమితమైన మున్సిపల్ అధికారులు పొలీస్ డిపార్ట్ మెంట్ కు చెందిన వ్యక్తిపై చర్యలు తీసుకోవడానికి సాహసించలేదు. మళ్లీ మున్సిపల్ అధికారులను కదిలించాలంటే అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్), ప్రజావాణిలో కలెక్టర్ కు మళ్లీ ఫిర్యాదు చేస్తే.. అప్పుడు మళ్లీ నోటీసుల పరంపర మొదలుపెట్టారు తప్పితే.. చర్యలు తీసుకోవడానికి మాత్రం జంకుతున్నారు.
-పై రెండు ఉదాహరణలు చాలు.. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుండడానికి మున్సిపాలిటీ అధికారులు ఎలా బాధ్యులవుతున్నారో తెలియజేయడానికి.. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం, పట్టింపులేని తనం, పని చేయకుండా ఉండడం ఆదిలాబాద్ జిల్లా కేంద్ర ప్రజలకు శాపంగా మారింది. ఓ వైపు చెరువులు, నాలాల బఫర్ జోన్లలో కట్టడాలు ఉన్నా.. పట్టించుకోకుండా వదిలేస్తుండడంతో ఇండ్లలోకి నీరుచేరుతున్నది. మరోవైపు పారిశుధ్య నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలు చేపట్టకపోవడంతో రోగాలు ప్రబలుతున్నాయి.
అక్రమ కట్టడాలతో అనేక ఇబ్బందులు
అక్రమ కట్టడాల పట్ల ఆదిలాబాద్ మున్సిపాలిటీ అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదు. చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్, నాలాల బఫర్ జోన్లలోనూ పలువురు నిర్మాణాలు చేపడుతున్నారు. సెట్ బ్యాక్స్ వదలకుండా నిబంధనలకు విరుద్ధంగా అనేక మంది బిల్డింగుల మీద బిల్డింగులు కట్టేస్తున్నారు. ఫిర్యాదులు వస్తే చాలా వరకు బిల్డింగులు ‘అన్ ఆథరైజ్డ్’ అని నిర్ధారిస్తున్న మున్సిపల్ అధికారులు నోటీసుల వరకు మాత్రమే పరిమితమవుతున్నారు. ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో అధిక వర్షాలు కురిసినప్పుడు చెరువుల చుట్టూ, నాలాల వద్ద ఉన్న ఇండ్లలో నీరు చేరుతున్నది. అక్రమార్కులు చేసి పాపానికి సామాన్య, పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ఇండ్లు విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ వంటి నగరంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యవస్థ అయిన హైడ్రా.. అక్కడ చెరువులు, నాలాల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో కట్టిన కట్టడాలను కూల్చివేస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఆదిలాబాద్ కు సైతం అలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వానికి విన్నవించారు. ఆ వినతికి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆయా జిల్లాల్లో హైడ్రా లాంటి వ్యవస్థలను ఏర్పాటు చేయాలని సంబంధిత జిల్లా కలెక్టర్లకు సూచించారు.
మున్సిపాలిటీ తీరువల్లే పారిశుధ్య లోపం
ఆదిలాబాద్ మున్సిపాలిటీ తీరు వల్ల జిల్లా కేంద్రంలో పారిశుధ్య లోపం కనిపిస్తున్నది. దీంతో రోగాలు ప్రబలి రిమ్స్ లో రద్దీ పెరుగుతున్నది. పారిశుధ్య లోపానికి కారణమవుతున్న తాటిగూడలోని మినీ వాటర్ ట్యాంక్ ను మున్సిపల్ అధికారులు తొలగించకపోవడం ఉద్దేశ్యపూర్వకమనే విమర్శలున్నాయి. ప్రస్తుతం మున్సిపల్ పాలకవర్గం బీఆర్ఎస్ చేతుల్లో ఉన్నది. దీంతో కాంగ్రెస్ పై ప్రజా వ్యతిరేకత తీసుకురావడానికి కొందరు కౌన్సిలర్లు.. మున్సిపల్ అధికారులు, సిబ్బందితో మిలాఖత్ అయి పారిశుధ్య నిర్వహణ సరిగా జరగకుండా చూస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కావాలనే మురుగు కాల్వలు తీయకపోవడం, ఒక్కో ప్రాంతంలో నాలుగైదు రోజులు చెత్త సేకరించే వాహనాలను పంపించకపోవడం లాంటివి చేస్తున్నారనే విమర్శలున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్ర
రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తున్నది. ఇచ్చిన హామీలు అమలు చేస్తుండడంతో సామాన్య ప్రజల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. రుణమాఫీ, రూ. 500కే గ్యాస్ సిలిండర్, ఇండ్లకు ఫ్రీ కరెంట్ వాటితో ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు దూరమవుతున్నాయి. దీంతో ప్రతిపక్షాలకు ఎలాంటి అస్త్రాలు దొరకడం లేదు. దీంతో విపక్ష పార్టీలకు చెందిన కొందరు మున్సిపల్ అధికారులతో చేతులు కలిపినట్లు ప్రచారం జరుగుతున్నది. అందుకే ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై కావాలనే మున్సిపల్ అధికారులు స్పందించడం లేదని తెలుస్తున్నది. అంతేకాకుండా మున్సిపాలిటీకి చెందిన కొందరు ఉన్నతాధికారులు విపక్ష పార్టీలకు చెందిన నేతల ఇండ్లకు తరచూ వెళ్తుండడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నది.