Wednesday, February 5, 2025
HomeUncategorized*ఆంధ్రలో  హెచ్ఎంపివి కేసులు లేవు.*వైరస్  పట్ల ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదు....*

*ఆంధ్రలో  హెచ్ఎంపివి కేసులు లేవు.*వైరస్  పట్ల ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదు….*

ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి*



*రాష్ట్రంలో హెచ్ఎంపివి కేసులు లేవు*

*వైరస్  పట్ల ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదు….*

*ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి*

అమరావతి: చైనాలో గుర్తించిన మరో కొత్త వైరస్ హెచ్ఎంపివి (హ్యూమన్ మెటా న్యూమో వైరస్) కి సంబంధించిన కేసులు రాష్ట్రంలో ఎక్కడా లేవని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి ఆదివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ వైరస్ కారణంగా ప్రజలెవరూ భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదన్నారు.  న్యూమో విరిలే కుటుంబానికి చెందిన ఈ వైరస్ కరోనా వైరస్ తరహాలోనే ఒకరి నుండి మరొకరికి  సంక్రమిస్తుందని ఆమె తెలిపారు.  చిన్నపిల్లలు, వృద్ధులు, వ్యాధి నిరోధకశక్తి తక్కువగా వున్న వారిపై ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా వుంటుందన్నారు. వైరస్ సోకిన వారి దగ్గు, తుమ్ముల వల్ల వెలువడే తుంపర్ల ద్వారా, వారితో సన్నిహితంగా మెలగటం, కరచాలనం, స్పర్శ వంటి చర్యల ద్వారా ఈ వైరస్  వ్యాపిస్తుందని ఆమె వివరించారు. పాత్రలపై వైరస్ ఉన్నట్లయితే, తాకిన తరువాత అదే చేతితో నోరు, ముక్కు, కళ్లను తాకటం ద్వారా మన శరీరంలోకి ఈ వైరస్ వ్యాపిస్తుందని నిపుణులు నిర్ధారించినట్లు ఆమె  పేర్కొన్నారు.  వైరస్ సోకిన తరువాత వ్యాధి లక్షణాలు 3  నుండి 10 రోజులలోగా బయటపడతాయన్నారు.  హెచ్ఎంపివి సోకిన వారికి సాధారణ జలుబు (ఫ్లూ) లాంటి లక్షణాలు వుంటాయన్నారు.  దగ్గు, ముక్కు దిబ్బెడ, ముక్కు కారడం,  గొంతు నొప్పి, శ్వాస సంబంధిత సమస్యలు కూడా కన్పిస్తాయని ఆమె తెలిపారు.  కొన్నిసార్లు న్యూమోనియా, బ్రాంకైటిస్ (ఆస్తమా) వంటి శ్వాసకోశ సమస్యలకు కూడా ఇది దారి తీస్తుందన్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ వ్యాధి నిరోధకశక్తి తక్కువగా వున్న వారిలో ఈ వైరస్ తీవ్ర అనారోగ్యాన్ని కలిగిస్తుందన్నారు.
వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి కోవిడ్ సమయంలో పాటించిన తరహాలోనే జాగ్రత్తలు పాటించాలని ఆమె సూచించారు. 20 సెకన్లపాటు సబ్బు నీటితో తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం, దగ్గినపుడు, తుమ్మినపుడు, నోటిని, ముక్కుని చేతిరుమాలుతో అడ్డు పెట్టుకోవాలన్నారు.  రద్దీగా వుండే ప్రదేశాలకు దూరంగా వుండటం, వాడిన వస్తువులను ఇతరులతో పంచుకోకుండా వుండటం వంటి చర్యలతో పాటు తగినంత పౌష్టికాహారం, మంచినీరు తీసుకోవాలని, తగినంత నిద్ర పోవాలని సూచించారు. వైరస్ లక్షణాలు కన్పించిన వారు క్వారంటైన్ లో వుండటం మంచిదని ఆమె తెలిపారు.   వైరస్ సోకిన వ్యక్తులు లేదా లక్షణాలు కన్పిస్తున్న వ్యక్తులు ఇతరులతో కరచాలనం చేయరాదని, ఉపయోగించిన టవల్స్, రుమాళ్ల వంటి వాటిని మళ్లీ వాడరాదని, చేతులతో తరచు కళ్లు, ముక్కు, నోటిని తాకరాదని, బహిరంగ ప్రదేశాలలో ఉమ్మివేరయాదని సూచించారు.  అదే విధంగా వైరస్ లక్షణాలున్న వ్యక్తులకు సమీపంగా ఇతరులు వుండకూడదన్నారు. వైరస్ సోకినట్లు అనుమానం వున్న వారు వైద్యుల సలహా మేరకు మందులు వాడాలని, ఎటువంటి సొంత వైద్య చేసుకోకూడదని ఆమె సూచించారు.
ఇప్పటి వరకూ హెచ్ఎంపివికి నిర్దిష్టమైన యాంటీ వైరల్ చికిత్స అనేది లేదన్నారు.  వ్యాక్సిన్లు కూడా అభివృద్ధి చేయలేదన్నారు. ఆరోగ్య సంరక్షణ కోసం నొప్పి నివారణ మందులు, ఆక్సిజన్ తెరపీ వంటివి ఇవ్వటం జరుగుతోందన్నారు. వైరస్ తీవ్రతకు ఎక్కువగా గురయ్యే చిన్న పిల్లలు, వృద్ధులకు ప్రభుత్వ ఆస్పత్రులలో తగిన చికిత్స అందిస్తారని ఆమె తెలిపారు.  ప్రస్తుతం వైరస్ వ్యాప్తి తక్కువ స్థాయిలోనే వుందని, ఇప్పటి వరకూ మన భారత దేశంలో కానీ, ఏపీలో కానీ ఎక్కడా కేసులు నమోదు కాలేదని ఆమె స్పష్టం  చేశారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తంగా ఉంటూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి అవసరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయని డాక్టర్ పద్మావతి  వివరించారు.
——————–

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments