రెడ్డి వర్సెస్ రెడ్డి.!
టీపీసీసీ, ఏఐసీసీ పెద్దల ద్వారా ప్రయత్నాలు
-ఫిరోజ్ ఖాన్, సీనియర్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, 9640466464
టీపీసీసీ చీఫ్ గా మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశమున్న నేపథ్యంలో పార్టీని సన్నద్ధం చేసేందుకు జిల్లా వారీగా రివ్యూ మీటింగులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా డీసీసీలను నియమించవచ్చే చర్చ జరుగుతున్నది. దీంతో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నేతలు ఆ పీఠాన్ని దక్కించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రేసులో చాలా మంది నేతలు ఉన్నా.. కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి మధ్యే తీవ్ర పోటీ ఉన్నట్లు తెలుస్తున్నది. టీపీసీసీ, ఏఐసీసీ పెద్దల ద్వారా వారు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు చర్చ జరుగుతున్నది. అయితే కేడర్ నుంచి ఎలాంటి వ్యతిరేకత రాకుండా.. పార్టీకి చెడ్డ పేరు రాకుండా అవినీతి ఆరోపణలు లేని వ్యక్తిని డీసీసీ పీఠంపై కూర్చోబెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నది.
సాజిద్ ఖాన్ సస్పెన్షన్ నుంచి ఖాళీగానే..
గత అసెంబ్లీ ఎన్నికల నుంచే ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్ష పదవి ఖాళీగానే ఉన్నది. కాంగ్రెస్ విపక్షంలో ఉన్నప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో పార్టీని మాజీ మంత్రి సీఆర్ఆర్, సాజిద్ ఖాన్, గండ్రత్ సుజాత, భార్గవ్ దేశ్ పాండే, సంజీవ్ రెడ్డి వంటి వారు ముందుండి నడిపించారు. అయితే బీజేపీ నుంచి ఎన్ఆర్ఐ కంది శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరగానే పార్టీ రెండు గ్రూపులుగా విడిపోయింది. ఎన్ఆర్ఐ కంది శ్రీనివాస్ రెడ్డి ఒకవైపు, అప్పుడు డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సాజిద్ ఖాన్, గండ్రత్ సుజాత, సంజీవ్ రెడ్డి మరోవైపు నిలిచారు. ‘ట్రిపుల్ ఎస్’కు భార్గవ్ దేశ్ పాండే సైతం మద్దతు తెలిపారు. అయితే ఆదిలాబాద్ నియోజకవర్గ టికెట్టు కోసం ఎవరికి వారు ప్రయత్నాలు చేయగా, అధిష్టానం కంది శ్రీనివాస్ రెడ్డిపై భరోసా ఉంచింది. ఆదిలాబాద్ నుంచి ఆయన్ను బరిలో నిలిపింది. ఫలితంగా ట్రిపుల్ ఎస్ తరపున సంజీవ్ రెడ్డి రెబల్ గా నామినేషన్ దాఖలు చేశారు. దీంతో అధిష్టానం సాజిద్ ఖాన్, సంజీవ్ రెడ్డి, గండ్రత్ సుజాత, భార్గవ్ దేశ్ పాండేపై ఆరేళ్లపాటు సస్పెన్షన్ విధించింది. అప్పటి నుంచి డీసీసీ పోస్టు ఖాళీగానే ఉన్నది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సాజిద్ ఖాన్, సుజాత, సంజీవ రెడ్డి, భార్గవ్ దేశ్ పాండేలపై పార్టీ ఒకసారి సస్పెన్షన్ ఎత్తివేసి తిరిగి పార్టీలోకి తీసుకున్నట్లు టీపీసీసీ నాయకులు ప్రకటించారు. అయితే ఆ తర్వాత కంది శ్రీనివాస్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ సస్పెన్షన్ యథావిధిగానే కొనసాగుతుందని టీపీసీసీ నుంచి మళ్లీ ప్రకటనలు జారీ అయ్యాయి. అయితే వీరికి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కేడర్ ఉండడంతో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీకి ఎంతో మేలు జరుగుతుందని భావించి సాజిద్ ఖాన్, సుజాత, సంజీవ రెడ్డితోపాటు భార్గవ్ దేశ్ పాండే పై సస్పెన్షన్ ఎత్తివేసి పార్టీలోకి ఆహ్వానించనున్నట్లు చర్చ జరుగుతున్నది.
స్థానిక ఎన్నికల నేపథ్యంలో..
ఇన్నాళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. గ్రామాల్లో పాగా వేసి ఉన్నది. స్థానిక ప్రజాప్రతినిధుల్లో ఆపార్టీ వారే ఎక్కువ. మరో వైపు ఆదిలాబాద్ లో బీజేపీ గెలవడంతో ఆ పార్టీ ప్రభావం గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తున్నది. బోథ్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఒక్క ఖానాపూర్ సెగ్మెంట్లో మాత్రమే కాంగ్రెస్ పాగా వేయగలిగింది. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా అంతటా పర్యటించి అందరిని కలుపుకొని పోయే నాయకుడికి డీసీసీ పోస్టు ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నది. అందుకోసం అధిష్టానం పార్టీని సమర్థవంతంగా నడిపే, కాంగ్రెస్ కార్యకర్తలతో మమేకమై, పార్టీకి చెడ్డపేరు రాకుండా ముందుకు తీసుకెళ్లగల నాయకుడిని డీసీసీ పీఠంపై కూర్చోబెట్టేందుకు తీవ్ర కసరత్తులు చేస్తున్నట్లుగా తెలుస్తున్నది.
ఇద్దరి మధ్యే తీవ్ర పోటీ..
డీసీసీ అధ్యక్ష పదవి కోసం అనేక మంది నాయకులు ప్రయత్నాలు చేస్తున్నా.. కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి మధ్యే తీవ్ర పోటీ ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే సీనియర్లను కాదని.. కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం భరోసా సంపాదించి.. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్టు సాధించుకోగలిగిన కంది శ్రీనివాస్ రెడ్డి.. మూడో స్థానంతో పెట్టుకున్నారు. ఆ తర్వాత అధిష్టానం ఆయనకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది. ఆ తర్వాత ప్రభుత్వంలో ఏదైనా నామినేటెడ్ పోస్టు కోసం ఆయన తీవ్ర ప్రయత్నాలు చేసినట్లు చర్చ జరిగింది. అయితే ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులకు ఎలాంటి పదవి ఇవ్వొద్దని కాంగ్రెస్ సూత్రప్రాయ నిర్ణయం తీసుకోవడంతో ఆయనకు అవకాశం లభించలేదు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి కోసం చెప్పుకోదగ్గ ఓట్లను రాబట్టడంలో కంది శ్రీనివాస్ రెడ్డి విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు డీసీసీ పోస్టు కోసం తనకు తెలిసిన నాయకుల ద్వారా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే హెచ్1బీ వీసా స్కామ్ లో ఆయన పేరు బయటకు రావడంతో అధిష్టానం ఆలోచనలో పడినట్లు తెలుస్తున్నది. వివిధ రకాల ఆరోపణలు ఉన్న వ్యక్తికి డీసీసీ పగ్గాలు అప్పగిస్తే పార్టీ ఇమేజ్ పై నెగెటివ్ ఎఫెక్ట్ పడుతుందని భావిస్తున్నట్లు సమాచారం.
శ్రీకాంత్ రెడ్డికి అవకాశాలు..
రైతు కుటుంబం నుంచి వచ్చిన బోరంచు శ్రీకాంత్ రెడ్డి 2006 నుంచి కాంగ్రెస్ లో పని చేస్తున్నారు. అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. మేజర్ పంచాయతీ అయిన మావల ఇన్ చార్జి గా పని చేశారు. 2019 నుంచి 2021 వరకు డీసీసీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. ప్రస్తుతం కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. పార్టీ అధికారంలో ఉన్నా.. లేకపోయినా.. పార్టీ తరపున కార్యక్రమాలు చేస్తూ ఉండడం ఆయనకు ప్లస్ పాయింట్. అంతేకాకుండా పార్టీ ఓటు బ్యాంకు జారిపోకుండా కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. కంది శ్రీనివాస్ రెడ్డి కంటే సీనియర్ కావడం, పార్టీ పట్ల డెడికేషన్ ఉండడం ఆయనకు కలిసొచ్చే అవకాశముంది. ఇప్పటికే తనకు డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని ఆయన ఏఐసీసీ నాయకురాలు దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. అయితే టీపీసీసీ చీఫ్ గా ఎంపికైన మహేశ్ కుమార్ గౌడ్ ఎవరిపై భరోసా ఉంచుతారో వేచి చూడాలి. కాగా, డీసీసీ అధ్యక్ష పీఠంపై ఎవరు కూర్చుంటారోనని కాంగ్రెస్ కార్యకర్తలు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.