మంత్రులు ఉత్తం కుమార్ రెడ్డి వెంకటరెడ్డి తో కలిసి పరిశీలించిన డిప్యూటీ సి ఏం భట్టి విక్రమార్క.
వచ్చే మార్చి 31 నాటికి యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ అన్ని యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క తెలిపారు.
బుధవారం ఆయన రాష్ట్ర మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లతో కలిసి నల్గొండ జిల్లా, దామరచర్ల మండలం లోని యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ఆయిల్ సింక్రనైజేషన్ ను స్విచ్ ఆన్ చేశారు.
ఈ సందర్భంగా మీడియాతో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ సంవత్సరం డిసెంబర్ చివరి నాటికి 3 యూనిట్ల ద్వారా 2400 మెగా యూనిట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తామని, వచ్చే సంవత్సరం మార్చి 31 నాటికి అన్ని స్టేజిలలో అన్ని యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. మార్చి 31కి విద్యుత్ అందించేందుకు సివిల్ పనులతో పాటు ,రైల్వే పనులు, బొగ్గు రవాణా వ్యయాన్ని తగ్గించేందుకు ఆ పనులను సైతం వేగవంతం చేసేలా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఇదే వేగంతో ప్రాజెక్టు పనులు పూర్తిచేసి యూనిట్ విద్యుత్తును 6.35 రూపాయలకు ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని ఆయన వెల్లడించారు .యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పూర్తయితే రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుతుందని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి ప్రజలు వారి ఎంతో విలువైన భూములను ఇచ్చి త్యాగం చేశారని, అలాంటి భూనిర్వాసితులకు భూసేకరణ నిధులతోపాటు, ప్రాజెక్టులో తప్పనిసరిగా ఉద్యోగాలు కల్పిస్తామని, ఇదే విషయాన్ని అధికారులతో నిర్వహించిన సమీక్షలో సైతం తన దృష్టికి తీసుకువచ్చినట్లు డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం వారి కుటుంబాలను గౌరవించడం ప్రభుత్వ బాధ్యత అని, వారికి సహేతుకంగా ఆలోచించి వారి కుటుంబాల్లో నిరుద్యోగులైన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.
2015, జూన్ 8న శంకుస్థాపన జరిగిన యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ప్రాజెక్టు పనులు , 2017లో ప్రారంభం అయ్యాయని, 2020 అక్టోబర్ నాటికి 2 యూనిట్లు, 2021 నాటికి మూడు యూనిట్లు పూర్తి చేయాలని గత ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించిందని, కానీ అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయలేకపోవడం వల్ల రాష్ట్ర ప్రజలపై ఆర్థిక భారం పెద్ద ఎత్తున పడిందని అన్నారు. దీనికి ప్రధాన కారణం గత ప్రభుత్వ చిత్తశుద్ధిలోపమని, అంతేకాక ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేయడంలో సమీక్షలు నిర్వహించకపోవడం, త్వరితగత్తిన పూర్తి చేయాలన్న ఆశయం లేకపోవడం అని డిప్యూటీ సీఎం తెలిపారు. దీనివల్ల ఉత్పత్తి వ్యయం పెరిగిందని, గత ప్రభుత్వం 50% దేశీయ బొగ్గును, 50 శాతం విదేశీ బగ్గును వాడాల్సి ఉండగా, దానికి విరుద్ధంగా నూటికి నూరు శాతం దేశీయ బొగ్గును వాడటం వల్ల ఎన్జీటీ క్లియరెన్స్ రాలేదని, తమ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎన్జీటీ క్లియరెన్స్లను తీసుకోవడంతోపాటు, ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసేందుకు నిరంతరం అధికారులతో సమీక్షించడం, ప్రతిరోజు ప్రాజెక్టు పనులపై పర్యవేక్షణ చేయడం జరుగుతున్నదని వెల్లడించారు. నూతన ప్రభుత్వ చర్యల వల్లనే సెప్టెంబర్ నాటికి ఆయిల్ సింక్రన్నైసేషన్ స్విచ్ ఆన్ వరకు తీసుకు రాగలిగామని, రాబోయే రోజుల్లో నిర్దేశించిన లక్ష్యం మేరకు ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని తెలిపారు.
రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ వై టి పి ఎస్ తో పాటు ,,పులిచింతల ప్రాజెక్టులో భూములు కోల్పోయిన వారికి తక్షణమే వారి కుటుంబాలలోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా వై టి పి ఎస్ లో చిన్న చిన్న సబ్ కాంట్రాక్టర్స్ కు పెండింగ్లో ఉన్న బిల్లులను తక్షణమే చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని ,అలాగే ట్రాన్స్ఫార్మర్స్, సబ్ స్టేషన్ లు మంజూరు చేయాలని ఉప ముఖ్యమంత్రి కి విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర రోడ్లు ,భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నాలుగు సంవత్సరాలు ఆలస్య మైనప్పటికీ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేయాలని తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి పనులను పూర్తి చేస్తున్నదని, ఇందులో భాగంగానే ఈ డిసెంబర్ నాటికి మూడు యూనిట్లు, మార్చి 2025 నాటికి అన్ని యూనిట్లు పూర్తి చేసి విద్యుత్ ను అందించనున్నట్లు వెల్లడించారు. భూములు ఇచ్చిన వారికి జాబితా రూపొందించి వారికి న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారని ఆయన తెలిపారు.
అంతకుముందు అధికారులతో డిప్యూటీ సి ఎం వైటిపిఎస్ పనుల పురోగతిపై మంత్రులతో కలిసి సమీక్షించారు .
సమావేశం ప్రారంభమైన తర్వాత రాష్ట్ర ఎనర్జీ సెక్రటరీ మరియు చైర్మన్ టీజీ జెన్కో ఎండి రోనాల్డ్ రోస్ యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ అన్ని యూనిట్ల పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు ..
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి, ఫైనాన్సు ,ప్లానింగ్ ,ఎనర్జీ శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ స్టేజ్ వన్, స్టేజి 2 లోని అన్ని యూనిట్లను నిర్దేశించిన సమయం ప్రకారం పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేకాక థర్మల్ పవర్ ప్లాంట్ పూర్తయ్యేనాటికి ఆర్ అండ్ బి రోడ్డును సైతం పూర్తిచేయాలని, ఈ విషయమై ఆర్ అండ్ బి మంత్రితో సమన్వయం చేసుకొని తక్షణమే టెండర్లు పిలిచి పనులు పూర్తి చేసేలా చూడాలన్నారు .
రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు తగిన విధంగా న్యాయం చేయాలని, వైటీపీఎస్ తో పాటు, పులిచింతల ప్రాజెక్టులో భూములు కోల్పోయిన వారి కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు .అంతేకాక ప్రాజెక్టులో సబ్ కాంట్రాక్ట్ పనులు చేసిన చిన్న చిన్న కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులను చెల్లించాలని కోరారు.
రాష్ట్ర రోడ్లు ,భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కి అవసరమైన ఆర్ అండ్ బి రోడ్ల పూర్తి వెంటనే చర్యలు తీసుకుంటామని, గురువారమే ఎస్ ఈ ని అక్కడికి పంపించి పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు.
మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రాజెక్టు పూర్తయ్యేనాటికి రహదారుల నిర్మాణం పూర్తి చేయాలని, అంతేకాక భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు.
కాగా వివిధ శాఖల అధికారులతో సమస్యలు వాటి పరిష్కారం పై ఉప ముఖ్యమంత్రి సమీక్షించారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి , అదనపు కలెక్టర్ జై శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్,
ప్రాజెక్టు డైరెక్టర్లు సచ్చిదానంద ,అజయ్, చీఫ్ ఇంజనీర్ సమ్మయ్య, పీవీ శ్రీనివాస్, జి శ్రీనివాసరావు, ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు, తదితరులు హాజరయ్యారు
_________________________________