ముఖ్య రహదారులపై గల దాదాపు 50 % స్తంభాలపై అనవసర కేబుల్స్ తొలగింపు
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ, తమ విద్యుత్ స్తంభాలపై అడ్డదిడ్డంగా మరియు సాధారణ ప్రజలకు ప్రాణాంతకంగా పరిణమించిన కేబుల్స్ ను తొలగించాల్సిందిగా గతంలో పలు మార్లు సమావేశాలు నిర్వహించి కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ ప్రొవైడర్లను తెలియజేయడం జరిగిందని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ముషారఫ్ ఫరూఖి ఐ.ఏ.ఎస్ తెలిపారు.
ఈ నేపథ్యంలో సోమవారం సంస్థ సీఎండీ, తన కార్యాలయంలో కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ ప్రొవైడర్ల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో పాల్గొన్న ప్రతినిధులు, ముఖ్య రహదారులపై దాదాపు 50 % పోల్స్ పై అడ్డదిడ్డంగా వేలాడుతూ, సాధారణ ప్రజలకు ప్రాణాంతకంగా పరిణమించిన కేబుల్స్ ను సరిచేశామని, మిగిలిన వాటిని కూడా వీలైనంత త్వరగా తొలగించేందుకు వేగంగా పనులు చేస్తున్నామని దానికి సంబంధించి మరింత గడువు కావాలని ప్రతినిధులు కోరారు.
దీనికి స్పందనగా సీఎండీ మాట్లాడుతూ, ఆక్ట్ ఫైబర్, GTPL/ భారత్ ఫైబర్, ఐ నెట్ సంస్థలు తమకు కేటాయించిన పనుల్లో దాదాపు 100% శాతం పూర్తి చేశాయన్నారు. అందుకు అభినందలు తెలిపారు. కొన్ని సంస్థలు మాత్రమే ఈ తొలగింపు పనులు చేపడుతున్నాయని, మిగిలిన వారు కూడా తొలగింపు పనులు చేపట్టాలన్నారు. ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని, వారి అభ్యర్ధనను గౌరవ ముఖ్య మంత్రి, గౌరవ ఉప ముఖ్య మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వారి అభిప్రాయం మేరకు తదుపరి కార్యాచరణ సూచిస్తామన్నారు. అప్పటి వరకు తొలగింపు పనులు వేగంగా చేపట్టాలన్నారు.
తెలంగాణ కేబుల్ ఇంటర్నెట్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ, విద్యుత్ స్తంభాలపై గల కేబుల్స్ తొలగింపు పనుల పురోగతిపై సీఎండీ సంతృప్తి వ్యక్తం చేసారని, హైదరాబాద్ నగరంలోని దాదాపు 28 కంపెనీ లు ఈ తొలగింపు ప్రక్రియలో పాల్గొంటున్నాయని అసోసియేషన్ సభ్యులు తెలిపారు.
ఈ సమావేశంలో సీఎండీ గారితో పాటు, సంస్థ డైరెక్టర్ కమర్షియల్ శ్రీ కే రాములు, అసోసియేషన్ ప్రతినిధులు శ్రీ సతీష్ బాబు, శ్రీ సలాం ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.