*సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న కోడిగుడ్డు ధర..*
*ఒక్కో గుడ్డు ఎంతకు చేరిందంటే..*
హైదరాబాద్: రోజురోజుకూ కోడిగుడ్డు రేటు విపరీతంగా పెరిగిపోతోంది. ఒకవైపు.. కూరగాయలు ధరలు మండి పోతుంటే.. మరోవైపు, కోడిగుడ్డు రేటూ సామాన్య ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. హోల్ సేల్ మార్కెట్‌లో కోడిగుడ్డు ధర రూ. 5.90గా నెక్ నిర్ణయించింది. దీంతో, రిటైల్ మార్కెట్‌లో రూ. 6.50 నుంచి రూ. 7 వరకూ పలుకుతోంది. ప్రస్తుతం కోడిగుడ్డు కొనాలంటేనే ప్రజలు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రానున్న రోజుల్లో వీటి ధర మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. చలి కాలంలో గుడ్డు వినియోగం పెరగడం, క్రిస్మస్, నూతన సంవత్సవ సందర్భంగా కేకుల తయారీకి గుడ్లను పెద్ద ఎత్తున వినియోగించ నున్నారు. ఈ నేపథ్యంలో రేట్లు మరింత పెరిగి ఆకాశాన్ని అంటే అవకాశం ఉంది. అలాగే కోళ్ల దాణా రేట్లు, రవాణా ఖర్చులు, గుడ్ల ఉత్పత్తి సైతం వీటి ధరను ప్రభావితం చేస్తాయని పౌల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
కాగా, ఈ ఏడాది జనవరిలో ఒక్కో కోడిగుడ్డు ధర రూ. 7లు పలికింది. ఏప్రిల్ నెల వచ్చే సరికి ఏకంగా గుడ్డుకు రూ. 2.5 నుంచి రూ. 3 వరకూ తగ్గి రూ. 4 నుంచి రూ. 4.50 వరకూ ధర పలకింది. మే నెలలో రూ. 5 నుంచి రూ. 5.50కు గుడ్డు ధర చేరింది. అలాగే జూన్, జులై మాసాల్లో పెరుగుతూ ఆగస్టు నెల వచ్చే సరికి రూ. 6 నుంచి రూ. 6.50కు చేరుకుంది. తాజాగా మళ్లీ రూ. 7లకు చేరి సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం డజన్ కోడిగుడ్లు రూ. 84లు పలుకుతున్నాయి.
చలి కాలంలో ఉష్ణోగ్రతలు పడి పోవడం, కోళ్ల ఆరోగ్య ప్రభావితం కావడం, కోడిగుడ్ల ఉత్పత్తి తగ్గడం, న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా కేకుల వినియోగం పెరగడం వంటి పలు కారణాలతో రేట్లు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల లోనూ వీటి వినియోగం విపరీతంగా పెరిగి పోయింది. దీంతో, రేట్లు కొండెక్కి సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి..