*- సామాన్య ప్రజలు సంతోషపడేలా పని చేయాలి*
*- రెవెన్యూ వ్యవస్థలో మార్పు రావాలి*
*- ప్రభుత్వ భూములను పరిరక్షించాలి*
*- ప్రతి గ్రామానికి రెవెన్యూ అధికారి*
*రెవెన్యూ సంఘాల సమావేశంలో రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి*
** * **
*హైదరాబాద్, సెప్టెంబర్ 21, 2024:* ప్రజాపాలనలో ప్రజలు కేంద్ర బిందువుగా తమ ప్రభుత్వ నిర్ణయాలు, ఆలోచనలు ఉంటాయని వాటిని దృష్టిలో పెట్టుకుని సామాన్య ప్రజలు సంతోషపడేలా రెవెన్యూ శాఖలోని అధికారులు, సిబ్బంది సమిష్టిగా చిత్తశుద్ధితో పని చేయాలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అన్నారు. రెవెన్యూ శాఖలోని ఐదు సంఘాలతో శనివారం నాడు సచివాలయంలో మంత్రిగారు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రిగారు మాట్లాడుతూ “మీ పని తీరు మరింత మెరుగు పడాలి. గతంలో పని చేసిన విధానం వేరు, ఇప్పుడు వేరు. ఏమైనా ఉంటే పాత వాసనలు పక్కకు పెట్టండి. నిజాయితీ, నిబద్ధతతో పారదర్శకంగా పనిచేయండి.
రెవెన్యూ యంత్రాంగం పాజిటివ్ దృక్పథంతో పని చేస్తూ ప్రజల్లో ఒక నమ్మకాన్ని కల్పించాలి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి. మాది ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వం. ఎవరిమీద వ్యక్తిగత కోపాలు లేవు. మా తపన అంతా ఈ పేద ప్రజానీకానికి మేలు చేయాలన్నదే. రాబోయే రోజుల్లో రెవెన్యూ వ్యవస్థలో స్పష్టమైన మార్పు కనిపించాలి. ప్రభుత్వానికి రావలసిన ప్రతి రూపాయి రావాల్సిందే, ప్రతి అంగుళం రావాల్సిందే, గజం భూమి కూడా కబ్జాకు గురి కావొద్దు. ప్రభుత్వ భూములను కాపాడే విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా న్యాయపరంగా గట్టిగా వ్యవహరించాలి. ఈ విషయంలో సరైన సూచనలు, సలహాలు ఇవ్వడానికి వీలుగా సచివాలయంలోని రెవెన్యూ ముఖ్య కార్యదర్శి కార్యాలయంలో ప్రత్యేకంగా లీగల్ సెల్ ను ఏర్పాటు చేస్తాం. గత ప్రభుత్వం తగిన ప్రత్యామ్నాయాలు సూచించకుండా వీఆర్‌ఓ, వీఏఓ వ్యవస్థను రద్దు చేయడం వల్ల, గ్రామీణ ప్రాంతాలలో రెవెన్యూ వ్యవస్థ లేకుండా పోయిందని, ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి ఉండేలా రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరిస్తాం.
ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ నవీన్ మిత్తల్ పాల్గొన్నారు. తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఛైర్మన్ శ్రీ వి. లచ్చి రెడ్డి, ట్రెసా అధ్యక్షులు శ్రీ వంగా రవీందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సివిల్ సర్వీసెస్ డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ కే. చంద్ర మోహన్, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ ఏలూరి శ్రీనివాస్, తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ రాములు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో బదిలీలు అయిన తహసీల్దార్లను పాత స్థానంలోనే కొనసాగించాలని అలాగే ఎమ్మార్వో, ఆర్డీవో పదోన్నతులు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల పదోన్నతులు, తహసీల్దార్ల ప్రభుత్వ కార్యాలయాలకు శాశ్వత భవనాలు, వాహనాల అద్దె బకాయిలు తదితర అంశాలను ఆయా సంఘాల ప్రతినిధులు మంత్రి గారి దృష్టికి తీసుకువచ్చారు. అదే విధంగా ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన రెవెన్యూ చట్టం ముసాయిదాను స్వాగతించారు. అలాగే SCS కోటా కింద 13 సంవత్సరాల పైబడి సర్వీస్ పూర్తి చేసుకున్న డిప్యూటీ కలెక్టర్లకు IAS క్యాడర్‌ల కన్ఫర్మేషన్ పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.
ఆర్థికేతర సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని మంత్రిగారు హామీ ఇచ్చారు. ఈ నెల 29వ తేదిన రాష్ట్రంలో ఉన్న ఎమ్మార్వో స్థాయి అధికారులతో, అక్టోబర్ 6వ తేదీన ఆర్డీవోలు, అదనపు కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లతో సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు.