
ఆదిలాబాద్ అంటే కాంగ్రెస్ కు అంత చిన్నచూపెందుకు?
-ఫిరోజ్ ఖాన్, సీనియర్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, 9640466464
తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై కాంగ్రెస్ పార్టీ వివక్ష చూపుతూనే ఉన్నది. ముఖ్యంగా పదవుల విషయంలో ఉమ్మడి జిల్లా నాయకులను చిన్నచూపు చూస్తున్నట్లు కనిపిస్తున్నది. ప్రభుత్వపరంగా మంత్రి, కార్పొరేషన్ పదవులు, ఎమ్మెల్సీ స్థానాల విషయంలో జిల్లా నాయకులను అసలు పట్టించుకోనట్లు భావించాల్సి వస్తున్నది. పార్టీ పదవుల పరంగానూ పరిస్థితి అలాగే ఉన్నది. నిధుల విడుదలలోనూ వివక్ష ఉందని జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో, ముఖ్యంగా ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో అనుకున్న స్థాయిలో కాంగ్రెస్ పార్టీని ఆదరించకపోవడంతోనే ఇప్పుడు ప్రజలపై కక్ష సాధింపు ధోరణిలా వ్యవహరిస్తున్నదనే చర్చ జరుగుతున్నది.
ఒక్క మంత్రి పదవీ లేదు..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. కాంగ్రెస్ పార్టీ నాలుగు స్థానాల్లో విజయం సాధించింది. ప్రభుత్వం ఏర్పడి సుమారు 16 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఉమ్మడి జిల్లా నుంచి ఒక్కరికీ మంత్రి పదవి ఇవ్వలేదు. ఖానాపూర్ నుంచి వెడ్మ బొజ్జు మొదటి సారి ఎమ్మెల్యే. బెల్లంపల్లి నుంచి గెలిచిన వినోద్ కు ఉమ్మడి రాష్ట్రంలో, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మంత్రిగా పని చేసిన అనుభవముంది. మంచిర్యాల నుంచి విజయం సాధించిన ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు, చెన్నూర్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే గడ్డం వివేక్ లు తొలిసారి ఎమ్మెల్యేలే అయినా.. గతంలో ఎమ్మెల్సీ, ఎంపీగా బాధ్యతలు నిర్వహించిన వారే. సీఎం రేవంత్ రెడ్డి మొదటగా తన మంత్రివర్గంలో పది మందికి అవకాశమిచ్చారు. అయితే ఇందులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఒక్కరిని కూడా ఎంపిక చేయలేదు. అదే సమయంలో ఉమ్మడి ఖమ్మం నుంచి మల్లు ముగ్గురు మంత్రులుగా ఉండడం గమనార్హం.
ఇతర పదవుల్లోనూ అంతే..
అధికారంలోకి వచ్చిన తర్వాత పదుల సంఖ్యలో కాంగ్రెస్ రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది. అయితే ఇందులో ఉమ్మడి జిల్లా నుంచి దండేపల్లి మండలానికి చెందిన కోట్నాక తిరుపతి ఒక్కరికే గిరిజన సహకార ఫైనాన్స్ కార్పొరేషన్ పదవి వరించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీని బతికించడానికి దశాబ్దాలుగా పని చేస్తున్న నాయకులెవరికీ రాష్ట్ర నాయకత్వం ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఉమ్మడి జిల్లా నుంచి ఎవరికీ కాంగ్రెస్ టికెట్ దక్కలేదు. అంతేకాకుండా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఉమ్మడి జిల్లా నాయకులను కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం పరిగణనలోకి తీసుకోలేదు. పార్టీ కోసం టికెట్ ను త్యాగం చేసి, దశాబ్దాలుగా పార్టీకి విశేష సేవలందిస్తున్న గిరిజన నాయకుడు డాక్టర్ నరేశ్ జాదవ్ కు ఎమ్మెల్సీ పదవి ఇస్తారనే ప్రచారం జరిగినా.. మొండిచేయే లభించింది.
ఇలా అయితే ‘రికవరీ’ కష్టమే
సరైన ప్రణాళికలు లేకపోవడం, పార్టీ కోసం కష్టపడిన నేతలను పట్టించుకోకపోవడంతో ఇప్పటికే అసెంబ్లీ, పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యాన్ని చెల్లించుకున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది స్థానాల్లో.. నాలుగింటిని మాత్రమే కాంగ్రెస్ కైవసం చేసుకోగలిగింది. మరోవైపు ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉంటే.. ఖానాపూర్ లో మినహా మరెక్కడా పార్టీ విజయం సాధించలేదు. ఇక్కడ నాలుగింటిలో బీజేపీ, రెండింటిలో బీఆర్ఎస్ నెగ్గాయి. ఉమ్మడి ఆదిలాబాద్ పశ్చిమ ప్రాంతమంతా బీజేపీ, బీఆర్ఎస్ హవానే కొనసాగింది. ఎంపీ ఎన్నికల్లోనూ ఆదిలాబాద్ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకున్నది. ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలుసైతం కాషాయ ఖాతాలోకే వెళ్లాయి. అనుకున్న మేర ఫలితాలు రాకపోవడంతోనే కాంగ్రెస్ ఇలా వ్యవహరిస్తున్నదని రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. నిధుల విషయంలోనూ కాంగ్రెస్ ఉమ్మడి ఆదిలాబాద్ పై వివక్ష చూపుతున్నదని గతంలో సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు ఆరోపించారు. తమ ప్రాంతాన్ని మహారాష్ట్రలో కలపాలని డిమాండ్ చేయడం అప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికైనా కాంగ్రెస్ తేరుకొని నష్టనివారణ చర్యలు చేపట్టకపోతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరో రెండు దశాబ్దాలు రికవరీ కావడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కనీసం ఒక మంత్రి పదవితోపాటు నాలుగైదు కార్పొరేషన్ చైర్మన్ పదవులు, పార్టీ పరంగానూ ప్రాధాన్యత ఉన్న పదవులు ఇవ్వాలనే డిమాండ్ జిల్లా ప్రజల నుంచి వస్తున్నది. అంతేకాకుండా అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరుతున్నారు.