ఊరు ఊరికో జమ్మి చెట్టు… గుడిగుడికో జమ్మి చెట్టు!
దసరా పండగకు గ్రీన్ ఇండియా చాలెంజ్ కొత్త కార్యక్రమం
ఇప్పటికే పదివేలకుపైగా జమ్మి మొక్కలు పంపిణీకి సిద్దం
స్వర్ణగిరి ఆలయంలో కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించిన
రాజ్యసభ మాజీ సభ్యుడు, జీఐసీ ఫౌండర్ సంతోష్‌కుమార్
దసరా పండగ సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ (జీఐసీ) మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నది. తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మిని ప్రతీ ఊరిలో, ప్రతీ గుడిలో నాటించాలని గొప్ప సంకల్పాన్ని ప్రారంభించబోతున్నది. దసరా పండుగ నాడు ఈ కార్యక్రమం లాంఛనంగా జమ్మి మొక్కలను నాటి ప్రారంభించనున్నది. ఈ కార్యక్రమ పోస్టర్‌ను స్వర్ణగిరి అలయ పూజారి చేతుల మీదుగా రాజ్యసభ మాజీ సభ్యుడు, జీఐసీ ఫౌండర్ జోగినపల్లి సంతోష్ కుమార్ శుక్రవారం ఆవిష్కరించారు.
వేద కాలం నుంచి అత్యంత ప్రతిష్ఠ కలిగిన చెట్టుగా, భక్తి పూర్వకంగా అందరూ పూజించుకునే జమ్మి చెట్టును తెలంగాణ రాష్ట్ర వృక్షంగా నాటి కేసీఆర్ ప్రభుత్వం గుర్తించింది. అయితే అనేక కారణాలతో అంతరించిపోతున్న జమ్మి చెట్టు,దాని విశిష్టత రీత్యా ప్రతీ ఊరిలో, ప్రతీ గుడిలో ఉండేలా, గ్రీన్ ఇండియా చాలెంజ్ తరపున ఊరు ఊరుకో జమ్మి చెట్టు- గుడిగుడికో జమ్మి చెట్టు నినాదాన్ని సంతోష్ కుమార్ తీసుకున్నారు.
తెలంగాణలో దసరా నాడు జమ్మి చెట్టును పూజించడం ఆచారం. జమ్మి ఆకులను బంధుమిత్రులకు ఇచ్చిపుచ్చుకుని అందరికీ మంచి జరగాలని కోరుకోవటం కూడా ఆనవాయితీ. ఈ ప్రాధాన్యతల దృష్ట్యా రానున్న దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఊరుఊరుకో జమ్మిచెట్టు- గుడిగుడికో జమ్మి చెట్టు కార్యక్రమం మొదలవుతుందని భువనగరి దగ్గర స్వర్ణగిరి అలయంలో జరిగిన పోస్టర్ రిలీజ్ సందర్భంగా సంతోష్‌కుమార్ ప్రకటించారు. ఇప్పటికే పది వేలకు పైగా జమ్మి మొక్కలను సిద్దం చేస్తున్నామని, అన్ని గ్రామాలు, గుడులకు వీటిని పంపిణీ చేస్తామని చెప్పారు.
గ్రీన్ ఇండియా చాలెంజ్ కోఫౌండర్ కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కాగానే, రాష్ట్ర వృక్షంగా జమ్మి చెట్టును అప్పటి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. వేదకాలం నుంచి నిత్య జీవితంలో భాగమైన జమ్మిని ఊరిలో గుడిలో బడిలో భాగస్వామ్యం చేయాలన్న గొప్ప ఆలోచన చేసిన సంతోష్ కుమార్ కు అభినందనలు తెలిపారు. తమవంతుగా ప్రతీ ప్రాంతంలో జమ్మి మొక్క నాటేలా, రక్షించి పెంచేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు