ఓటుకు నోటు కేసును ఉద్దేశిస్తూ సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
సీఎం రేవంత్ రెడ్డి పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్విటర్ వేదికగా ఓ జాతీయ మీడియా ఛానల్ తో రేవంత్ మాట్లాడుతున్న వీడియోను కేటీఆర్ పోస్టు చేశారు. ఆ వీడియోలు రేవంత్ మాట్లాడిన వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించారు.
‘ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడి జైలుకెళ్లిన రేవంత్ రెడ్డి తనలాగే అందరూ జైలుకు వెళ్లాలని కోరుకుంటున్నట్లుగా అనిపిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. తమ సంస్థపై ప్రభావం చూపిన ప్రభుత్వ పథకంపై అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకుగాను ఎల్ అండ్ టి వంటి ప్రఖ్యాత సంస్థకు చెందిన సీఈవో ను జైలుకు పంపిస్తాననడం కరెక్టేనా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి నిర్లక్ష్యమైన వ్యాఖ్యలతో పెట్టుబడిదారులకు ఏం సందేశం పంపుతున్నారు.. పెట్టుబడులను ఆకర్షించేందుకు రాహుల్ గాంధీ తమ సీఎంలకు ఇదే నేర్పిస్తున్నారా? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.
ఇదిలాఉంటే.. గత రెండు రోజుల క్రితం సినీ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సమయంలోనూ కేటీఆర్ రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. ‘‘సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట బాధితులకు పూర్తిగా సానుభూతి తెలుపుతాను. కానీ, ఘటనలో నిజంగా తప్పుచేసింది ఎవరని కేటీఆర్ ప్రశ్నించారు. ఘటనకు నేరుగా బాధ్యుడు కాని అల్లు అర్జున్ ను సాధారణ నేరగాడిలా ట్రీట్ చేయడం సరికాదని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వ తీవ్ర చర్యను ఖండిస్తున్నానని తెలిపారు. హైడ్రా కూల్చివేతలతో ఇద్దరి చావుకు బాధ్యుడైన రేవంత్ రెడ్డిని కూడా ఇదే లాజిక్ తో అరెస్టు చేయాలని కేటీఆర్ అన్నారు.