*గ్రామాలలో రెవెన్యూ సేవలు పునరుద్ధరణకు చర్యలు*
గత ప్రభుత్వం విఆర్‌వో, విఆర్ఎ వ్యవస్ధను రద్దుచేసి గ్రామీణ ప్రాంతాలలో సామాన్యులకు రెవెన్యూ సేవలను దూరం చేసింది. గ్రామీణ ప్రాంతాలలో రెవెన్యూ వ్యవస్థను పటిష్‌పరచడానికి గ్రామాలలో రెవెన్యూ సేవలు పునరుద్ధరణకు చర్యలు చేపట్టాం. రాష్ట్రంలో 10,954 రెవెన్యూ గ్రామాలలో రెవెన్యూ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఒక రెవెన్యూ ఉద్యోగిని నియమించడానికి కార్యాచరణను రూపొందించాం.
*సిద్ధమైన కొత్త చట్టం*
రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా నూతన రెవెన్యూ చట్టం -2024ను వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు అవసరమైన కార్యాచరణను సిద్ధం చేశాం. అంతకుముందు ఆగస్టు నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాలలో ముసాయిదా చట్టాన్ని అసెంబ్లీలో ప్‌లవేశపెట్టి విస్తృతంగా చర్చించాం. అదేరోజు సిసిఎల్‌ఏ వెబ్ సైట్ లో కూడా ముసాయిదా చట్టాన్ని పెట్టడం జరిగింది.
రైతు సంఘాలు, మేధావులు, ప్రజా ప్రతినిధులతో సాధారణ ప్రజానీకం మరియు రిటైర్డ్ అధికారుల నుంచి స్వీకరించిన సలహాలు, సూచనలతో కొత్త చట్టాన్ని తయారు చేశాం. ప్రతిపక్ష పార్టీకి చెందిన మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు బోయినపల్లి వినోద్ కుమార్ చేసిన సూచనలు కూడా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.
అలాగే రంగారెడ్డి జిల్లా యాచారం, నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలాల్లో పైలట్ ప్రాజెక్టు కూడా నిర్వహించడం జరిగింది. పద్దెనిమిది రాష్ట్రాలలో అధ్యయనం చేసి అక్కడ అమలు అవుతున్న మంచి అంశాలను ఈ చట్టంలో పొందు పరచడం జరిగింది.
తరతరాల భూ సమస్యలకు ముగింపు పలికేలా భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా, దేశానికే ఆదర్శంగా ఉండేలా ఒక రోల్ మోడల్ గా 2024 ఆర్వోఆర్ చట్టాన్ని తీసుకు రాబోతున్నాం.