*గ్రేటర్ లో అనుమతిలేని వాల్ పోస్టర్లు, వాల్ రైటింగ్స్ పై నిషేదం: కమిషనర్ ఆమ్రపాలి కాట*
*హైదరాబాద్, సెప్టెంబర్ 27:* హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంపొందించడం, సుందరీకరణ లక్ష్యంగా అనుమతులు లేని వాల్ పోస్టర్లు, వాల్ రైటింగ్ లను నిషేధించినట్లు జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి కాట తెలిపారు. అనుమతులు లేకుండా గోడలపై పోస్టర్లు అంటించడం, వాల్ రైటింగ్స్ చేసినట్లైతే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆయా సర్కిళ్ల సంబంధిత డిప్యూటీ కమిషనర్లు తమ పరిధిలోని ప్రింటింగ్ ప్రెస్, సినిమా థియేటర్ యజమానులతో సమావేశం ఏర్పాటు చేసి గోడలపై వాల్ పోస్టర్స్, సినిమా పోస్టర్లు అంటించకుండా, వాల్ రైటింగ్ రాయకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ విషయంలో డిప్యూటీ కమిషనర్లు అశ్రద్ధ వహించకుండా కఠినంగా వ్యవహరించాలని, అనుమతి లేకుండా వాల్ పోస్టర్లు, వాల్ రైటింగ్ చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే జరిమానాలు విధించాలని ఆదేశించారు. జరిమానాల వివరాల నివేదిక పంపించాలని కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసారు.