
*ట్రంప్ దెబ్బకి 5 విమానాల నిండా ఐఫోన్లను ఇండియా,చైనా నుండి అమెరికాకు పంపిన యాపిల్..*
ట్రంప్ టారిఫ్ ల భయంతో ఇండియా, చైనాల నుంచి తరలింపు
మార్చి నెలాఖరులో కేవలం మూడు రోజుల్లోనే ఎగుమతి
ఇప్పటికిప్పుడు ధరలు పెంచబోమని స్పష్టం చేసిన యాపిల్
ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్ ల నుంచి తప్పించుకునేందుకు యాపిల్ కంపెనీ వేగంగా స్పందించింది. భారత్, చైనాలలో తయారైన ఐఫోన్లను విమానాల్లో అమెరికాకు చేరవేసింది. కేవలం మూడు రోజుల వ్యవధిలో 5 విమానాలలో ఐఫోన్లను ఎగుమతి చేసినట్లు విమానాశ్రయం అధికారులు తెలిపారు. భారత్ నుంచి మూడు విమానాలు, చైనా నుంచి రెండు విమానాలు నిండా ఐఫోన్లతో అమెరికా చేరుకున్నాయని వివరించారు. ఏప్రిల్ 2 నుంచి ప్రతీకార సుంకాలు అమలులోకి వస్తాయన్న ప్రకటన నేపథ్యంలో మార్చి నెలాఖరులో యాపిల్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది.
పన్ను పోటును తగ్గించుకోవడానికి భారత్, చైనాలలోని తమ ఫ్యాక్టరీలలో తయారైన ఐఫోన్లు అన్నింటినీ వెంటనే అమెరికాకు చేరవేసింది. దీనివల్ల ఐఫోన్ల ధరలను మరికొంతకాలం స్థిరంగా ఉంచేందుకు యాపిల్ కంపెనీకి అవకాశం లభించిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇందుకు తగ్గట్లుగానే ట్రంప్ టారిఫ్ లు అమలులోకి వచ్చినప్పటికీ ఇప్పటికిప్పుడు ఐఫోన్ల ధరలు పెంచే ఆలోచన ఏమీ లేదని యాపిల్ కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది.