“దేశంలోనే ఒక చారిత్రాత్మక నిర్ణయం కుల గణన”.
బీసీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్
హైదరాబాద్ ఫిబ్రవరి 5
తెలంగాణ చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులగణన (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే 2024) దేశంలోనే ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం అని బిసి స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ శ్రీకాంత్ గౌడ్ పేర్కొన్నారు. బుధవారం నాడు ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేస్తూ, తెలంగాణ రాష్ట్రంలో విజయవంతంగా పూర్తి చేసిన సామాజిక, ఆర్థిక ,విద్య, ఉపాధి, రాజకీయ, కుల గణన (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే 2024) ఒక చారిత్రాత్మక అంశంగా పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే బలహీన వర్గాల జనాభా గణాంకాలపై చర్యలు చేపట్టడం ఆనందకరమని ఈ సర్వే నివేదికకు పూర్తి చట్టబద్ధత కల్పించాలని ఉద్దేశంతో కమిషన్ ఇచ్చిన నివేదికను మంత్రిమండలి అమల్లోకి తెచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 6 నవంబర్ 2024న సర్వే ప్రారంభించగా 25 డిసెంబర్ 2024 నాటికి పూర్తి అయ్యిందని 50 రోజులు సర్వే ముగిసిన సమయానికి మొత్తం కుటుంబాల సంఖ్య గ్రామీణ ప్రాంతాలలో 66,99,602 గా తేలిందని నగర ప్రాంతాలలో ఆ సంఖ్య 45,15,532 గా ఉందని మొత్తం 1,12,15,137 కుటుంబాలు అంటే 96.09% గా ఉందని సరిగ్గా ఏడాది కాలంలో పూర్తి చేసిన నివేదిక ప్రజల ముందు ఉంచడం అభినందనీయమని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 46.25% ఉన్న బీసీలు మైనార్టీలలోని బీసీలు కలుపుకొని 56.33% ఉండడం బీసీలందరికీ సమాజంలో సముచితమైన గౌరవ స్థానం కల్పించాలన్న ఆలోచన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు.
పకడ్బందీగా అమలు
ఇతర రాష్ట్రాలలో ఇలాంటి ప్రక్రియ న్యాయస్థానాల ముందు నిలవకపోవడంతో అలాంటి తప్పిదం జరగకుండా సర్వే పకడ్బందీగా ఉండేలా చర్యలు తీసుకున్నారని, అందుకు బీసీ సామాజిక వర్గాలకు న్యాయం జరగాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని అన్నారు. దేశవ్యాప్తంగా గత 75 సంవత్సరాలలో ఎన్నో వినతులు వచ్చిన బలహీనవర్గాలు, ఇతర కులాలు, ఉపకులాలకు, సంబంధించిన వివరాలు సేకరించబడలేదని అందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు తీర్పు అనంతరం వర్గీకరణ అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలబడడం ఆనందదాయకమని అన్నారు. రాష్ట్రంలో ఎస్సీలను మూడు గ్రూపులుగా విభజిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని షెడ్యూలు కులాలలో సంఖ్యాపరంగా అధికంగా ఉన్న మాదిగ ఉపకులాలు తొమ్మిది శాతం రిజర్వేషన్లు ఖరారు చేసిందని మాల ఉపకులాలను ఐదు శాతంగా అత్యంత వెనుకబడిన బుడగ జంగాలు తదితర కులాలకు ఒక శాతం రిజర్వేషన్ కేటాయించిందని ఈ నేపథ్యంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులతో పాటు ఇతర మైనార్టీ వర్గాలకు మేలు జరిగే అవకాశం ఉందని దీనితో విద్య, ఉద్యోగం, రాజకీయం, అని తేడా లేకుండా అన్ని రంగాలలో తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రిజర్వేషన్లను స్వాగతిస్తున్నామని అన్నారు. బీసీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా ఈ ఆనందాన్ని మా బీసీ సామాజిక వర్గంతో పంచుకునేందుకు ఆనందపడుతున్నానని శ్రీకాంత్ అన్నారు.