*పత్తి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడండి : మంత్రి తుమ్మల*
తెలంగాణలో పత్తి రైతులకు పత్తి కొనుగోలులో ఇబ్బందులు ఎదురవ్వకుండాచూడాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సీసీఐ అధికారులను కోరారు.
తెలంగాణలో పత్తి జిన్నింగ్ మిల్లర్లు సమ్మె ప్రకటించిన నేపథ్యంలో, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) సీఎండీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిలతో మాట్లాడారు. సమ్మె కారణంగా పత్తి రైతులు ఇబ్బందులు పడకుండా, పత్తిని తక్కువ ధరలకు అమ్మాల్సిన పరిస్థితి తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. పత్తి జిన్నింగ్ మిల్లర్లతో చర్చలు జరిపి, పత్తి కొనుగోళ్లు తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు. ఇది రైతుల ప్రయోజనాలను కాపాడడంలో కీలకమని మంత్రి తుమ్మల గట్టిగా చెప్పారు.
సీసీఐ తేమ, బరువు విషయంలో విధించిన నిబంధనలను నిరసిస్తూ రాష్ట్ర కాటన్ మిల్లర్లు, ట్రేడర్ల సంక్షేమ సంఘం సోమవారం నుంచి పత్తి కొనుగోళ్లు నిలిపివేసింది. దీంతో ఇప్పటికే పత్తి దిగుబడులకు సరైన ధర లభించడం లేదని ఆందోళన చెందుతున్న పత్తి రైతులకు మరిన్ని కష్టాలు ఎదురయ్యాయి. వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పత్తి కొనుగోళ్లు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని పత్తి రైతులు కోరుతున్నారు.