ఎం ఎల్ సీ కవిత

ప్రతి మహిళకు నెలకు 2500 చొప్పున ఇప్పటివరకు ₹35,000 బాకీపడ్డ రేవంత్ సర్కార్
మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణాన్ని స్వాగతిస్తున్నాము… కానీ ప్రభుత్వం మరిన్ని బస్సులు పెంచి మహిళలకు ప్రజా రవాణాను సులభతరం చేయాలి
ఎక్కడపోయింది మీ తులం బంగారం, స్కూటీ హామీ
మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజాక్షేత్రంలో నిలదీస్తాం
ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడుతాం
మహిళా దినోత్సవం లోపు హామీల అమలుపై కార్యాచరణ ప్రకటించాలి
రేవంత్ రెడ్డి సర్కార్ కి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరిక
హైదరాబాద్ : ఫిబ్రవరి11, (సమయం న్యూస్) కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజాక్షేత్రంలో పోరాటాలు చేస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. మహిళా దినోత్సవంలోపు హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించాలని చేయాలని అల్టిమేటం జారీ చేశారు.
మంగళవారం నాడు తెలంగాణ జాగృతి మహిళా విభాగం కార్యకర్తలతో తన నివాసంలో ఎమ్మెల్సీ కవిత సమావేశమయ్యారు. మహిళలకు ఇచ్చిన హామీల పై ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం విషయంలో చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… కెసిఆర్ పాలనలో మహిళలకు పెద్దపీట వేశామని, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలను చిన్నచూపు చూస్తున్నారని విమర్శించారు. మాయ మాటలు చెప్పి, అబద్ధపు హామీలు ఇచ్చి మహిళలను రేవంత్ రెడ్డి మోసం చేశారని విరుచుకుపడ్డారు.
“ప్రతి మహిళకు నెలకు 2500 చొప్పున డబ్బులు అందిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే 14 నెలలు గెలిచినా కూడా అమలు చేయకపోవడం దారుణం. 14 నెలల డబ్బు ₹ 35,000 కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు బాకీ పడింది. మహిళా దినోత్సవం లోపు ఈ హామీని నెరవేర్చాలి” అని డిమాండ్ చేశారు.
కల్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామన్న హామీ, ఆడపిల్లలందరికీ ఉచితంగా స్కూటీలు అందిస్తామన్న హామీలు ఏమయ్యాయని నిలదీశారు. మహిళలకు ఉచిత బస్సు పెట్టి మిగతా పథకాలను తుస్సుమనిపించారని ఎద్దేవా చేశారు. తాము మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణాన్ని స్వాగతిస్తున్నామని, కానీ ప్రభుత్వం మరిన్ని బస్సులు పెంచి ప్రజా రవాణాను సులభతరం చేయాలని సూచించారు.
కేవలం మహిళలనే కాకుండా అన్ని వర్గాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్రోహం చేశారని ధ్వజమెత్తారు. మహిళల పేరిట ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఆ ప్రక్రియనే మొదలుపెట్టలేదని ఎత్తిచూపారు. సంక్రాంతికి సన్నబియ్యం ఇస్తామని ఇప్పటికీ ఇవ్వకుండా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. పెన్షన్లను తక్షణమే నాలుగు వేలకు పెంచాలని డిమాండ్ చేశారు.