HomeUncategorizedమహబూబ్ నగర్ 05.09.2024____________________________________ గురువులను దైవంగా భావించే సంస్కృతి మనదని, తల్లిదండ్రుల తర్వాత గురువులదే...
మహబూబ్ నగర్ 05.09.2024 ____________________________________
గురువులను దైవంగా భావించే సంస్కృతి మనదని, తల్లిదండ్రుల తర్వాత గురువులదే స్థానం అని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు.
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవానికి జిల్లా కలెక్టర్ హాజరై మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటామని, గురువులను దైవంగా భావించే సంస్కృతి మనదని, తల్లిదండ్రుల తర్వాత గురువులదే స్థానం అని, గురువులు పౌరులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని అన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి వారందరూ ఉత్తమ పౌరులుగా తయారయ్యేలా చూడాలని అన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు, క్రమశిక్షణ, సమాజంపై అవగాహన, కమ్యూనికేషన్ స్కిల్స్, హ్యాండ్ రైటింగ్, వ్యక్తిగత పరిశుభ్రత, పెద్దలను గౌరవించే విధానాలను వారికి నేర్పాలని, ఇంట్లో తల్లితండ్రులు చెబితే పిల్లలు అంతగా గుర్తించుకోరని కానీ పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులకు ఏం చెప్తే అది విద్యార్థులు ఎక్కువ కాలం గుర్తుంచుకుని దానిని పాటిస్తారని ఆమె అన్నారు. ప్రైమరీ టీచర్లకు చాలా ఓపిక, సహనం ఉండాలని, విద్యార్థుల భవిత, భవిష్యత్తు ప్రతి ఉపాధ్యాయుడిపై ఉందని, ముఖ్యంగా ప్రైమరీ టీచర్లు పై ఉందని ఎందుకంటే ఒక విద్యార్థి మొదటగా పాఠశాలలో చేరినప్పుడు ఏవైతే నేర్చుకుంటారో అది ఎల్లకాలం గుర్తించుకుంటూ నేర్చుకున్న క్రమశిక్షణ, చదువు వంటివి హై స్కూల్ / కళాశాల దశలో వారికీ అలవాటు అవుతుందని ఆమె అన్నారు. మా నాన్న ఉపాధ్యాయుడిగా ఎన్నో సంవత్సరాలు విద్యానందించి పాత్రికేయుడిగా అలాగే కవిగా పనిచేసారని, అలాగే మా అమ్మ టీచర్ గా ఎన్నో సంవత్సరాలు విద్యార్థులకు విద్యానందించారని ఆమె తెలిపారు. జిల్లాలో తను పర్యటించే ప్రాంతంలోని దగ్గరగా ఉన్న కేజీబీవీ లేదా పాఠశాలలకు తప్పకుండా వెళుతున్నానని, అక్కడ విద్యార్థినీ, విద్యార్థులతో మాట్లాడి అక్కడ వారి చదువు, విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యత, ఇతర అంశాలపై వారిని అడిగి తెలుసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 38 మంది ఉపాధ్యాయులను శాలువాలు, మేమేంటోలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, జిల్లా విద్యాశాఖ అధికారి ఏ.రవీందర్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారి ఉమామహేశ్వర్, ఈ.ఈ. హౌసింగ్ వైద్యం భాస్కర్, జిల్లా వెల్ఫేర్ అధికారి, ఎ.డి. అనసూయ, ఎ.ఎం.ఓ. శ్రీనివాసులు, సీ.ఎం.వో. బాలు యాదవ్, మానిటరీ ఆఫీసర్ సంపత్, ఎం.ఈ. ఓ లు, ఉపాధ్యాయులు, సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. _____________________________