కల్తీ నెయ్యిపై సుప్రీంకోర్టుకు సిట్ ప్రాథమిక నివేదిక!
శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఉపయోగించే నెయ్యిని కల్తీ చేసిన వ్యవహారంలో సుప్రీంకోర్టు నియమించిన సిట్ ప్రాథమిక నివేదిక సమర్పించినట్లుగా తెలుస్తోంది. సీబీఐ డైరక్టర్ పర్యవేక్షణలో ఇద్దరు సీబీఐ, ఇద్దరు రాష్ట్ర పోలీసు అధికారులు, ఒక ఎఫ్‌ఎఎస్ఎస్ఐ అధికారి నేతృత్వంలో సిట్ దర్యాప్తు జరుపుతోంది. తిరుపతిలో ప్రత్యేక ఆఫీసు ఏర్పాటు చేసుకుని .. కింది స్థాయిలో దర్యాప్తు చేయడానికి సిబ్బందిని కూడా ఏర్పాటు చేసుకుని గత కొన్ని రోజులుగా ఈ దర్యాప్తు చేస్తున్నారు.
దర్యాప్తులో వెల్లడయిన అంశాల ఆధారంగా సుప్రీంకోర్టుకు ప్రాథమిక నివేదికను సిట్ సమర్పించినట్లుగా తెలుస్తోంది. నెయ్యి ప్రొక్యూర్ మెంట్ దగ్గర నుంచి ఎలా నెయ్యి సరఫరా చేశారు…ఎవరి పేరుతో ఎవరు సరఫరా చేశారు అనే వివరాలు కూడా పొందు పరిచినట్లుగా తెలుస్తోంది. ల్యాబ్ టెస్టులు సహా కీలక అంశాలను ప్రాథమిక నివేదికలో సుప్రీంకోర్టుకు నివేదించినట్లుగా తెలుస్తోంది. సుప్రీంకోర్టు తదుపరి విచారణ తర్వాత మరింతగా దర్యాప్తు చేసే అవకాశం ఉంది.
పదేళ్ల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం నిధుల్ని బొక్కేయడానికి ఇష్టం వచ్చినట్లుగా టెండర్లు ఇచ్చి నాసిరకం సామాన్లను కొనిపించి లడ్డూ నాణ్యతను దెబ్బతీశారని తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటి ఒడ్డుకు, ఇప్పటికి లడ్డూకు తేడాను భక్తులు నేరుగానే చెబుతున్నారు. ఇలాంటి సమయంలో దేవుడి ప్రసాదాన్ని మలినం చేసిన వారిని ఖచ్చితంగా శిక్షించాలన్న ఓ గట్టి అభిప్రాయం భక్తుల్లో ఉంది.