రాబోయే ఏడు సంవత్సరాలకు కావలసిన విద్యుత్తు సరఫరా ప్రణాళికలు సిద్ధం చేయండి
ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి రీసర్చ్ సెంటర్ ను ఏర్పాటు చేసుకోండి
ఆధునిక సాంకేతికత విజ్ఞానాన్ని అందించడానికి ఇంజనీర్లకు అవగాహన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించండి
ట్రాన్స్కో ఉన్నత అధికారుల సమీక్ష సమావేశంలో వెల్లడించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
రాష్ట్ర ప్రజలకు రాబోయే ఏడు సంవత్సరాలకు కావలసిన విద్యుత్తును సరఫరా చేయడానికి కావలసిన ప్రణాళికలను రూపొందించుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులకు నిర్దేశం చేశారు. సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ట్రాన్స్కో సంస్థను బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఉన్నత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం 15,700 మెగావాట్ల విద్యుత్తు పీక్ డిమాండ్ ఉన్నదని, రాబోయే ఏడు సంవత్సరాలకు 27వేల మెగా వాట్లకు పీక్ డిమాండ్ పెరిగే అవకాశం ఉన్నందున, ఆ అంచనాకు అనుగుణంగా విద్యుత్తును సరఫరా చేయడానికి కావలసిన ప్రణాళికలను రూపొందించుకొని కార్యాచరణను వెంటనే అమలు చేయాలని అన్నారు. ట్రాన్స్కో ఆధ్వర్యంలో చేపడుతున్న సబ్ స్టేషన్ల నిర్మాణం పనుల గురించి ఆరా తీశారు. సబ్ స్టేషన్ ల పనుల నిర్మాణానికి నిర్ణీత గడువు లక్ష్యంగా పెట్టుకొని పని చేయాలని సూచించారు. ఈ సంవత్సరం, రాబోయే రెండు సంవత్సరాల్లో సంస్థ పరంగా చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాల గురించి లోతుగా సమీక్షించారు. విద్యుత్ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. డైరెక్టర్ నుంచి ఈ వరకు ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని అప్డేట్ చేసుకొని సంస్థలు బలోపేతం చేసుకోవాలని సూచించారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి ట్రాన్స్కో లో రిసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఎనర్జీ సెక్రెటరీ రోనాల్డ్ రోస్ ను ఆదేశించారు. సంస్థలో పనిచేస్తున్న ఇంజనీర్లకు అధునాతన టెక్నాలజీ పైన అవగాహన, శిక్షణ తరగతులు నిర్వహించాలని సూచించారు. ట్రాన్స్కో సంస్థ బలంగా ఉన్నప్పుడే విద్యుత్ సరఫరా మెరుగ్గా ఉంటుందన్నారు. సంస్థను ఆర్థికంగా బలంగా ముందుకు తీసుకోవడానికి డైరెక్టర్ నుంచి ఏఈ స్తాయి వరకు ఉన్న అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. ట్రాన్స్కో ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అందిస్తున్న విద్యుత్తు సరఫరా, సబ్ స్టేషన్ల నిర్మాణం తదితర అంశాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎనర్జీ సెక్రెటరీ రోనాల్డ్ రోస్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కు వివరించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం సెక్రటరీ కృష్ణ భాస్కర్ ఐఏఎస్, ట్రాన్స్కో జె ఎండీ శ్రీనివాసరావు, ట్రాన్స్కో డైరెక్టర్లు జి. నర్సింగరావు, జె సూర్య ప్రకాష్, బి నర్సింగరావు, సిఈ, ఎస్ ఈ తదితరులు ఉన్నారు.