*హైడ్రా కూల్చివేతలతో ఇళ్లు కోల్పోయిన చిన్నారి వేదశ్రీ కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్*
హైడ్రా కూల్చివేతల కారణంగా ఇంటి తో తన పుస్తకాలు కోల్పోయిన చిన్నారి వేదశ్రీ కుటుంబాన్ని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. వేదశ్రీ తో మాట్లాడి ఇళ్లు కూల్చివేసిన రోజు ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. పుస్తకాలు కోల్పోయిన వేదశ్రీకి పుస్తకాలతో పాటు బ్యాగులను అందించారు. వారి కుటుంబానికి కూడా కేటీఆర్ ఆర్థికసాయం అందించారు. ఈ సందర్భంగా హైడ్రా కూల్చివేతల కారణంగా మా పిల్లలు, కుటుంబం మొత్తం రోడ్డున పడిందని కేటీఆర్ కు వేదశ్రీ కుటుంబ సభ్యులు తమ ఆవేదనను చెప్పుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమే చేసిన రిజిస్ట్రేషన్లలో కట్టుకున్న ఇళ్లను కూల్చివేస్తూ పేదల పట్ల రేవంత్ సర్కార్ నిర్దయగా వ్యవహరించిందంటూ మండిపడ్డారు. సడెన్ గా వచ్చి పేదల ఇండ్లను అప్పటికప్పుడు కూల్చివేయటమనేది చాలా అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం పేదలు అన్న మానవత్వం కూడా చూపించకుండా ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచాలకు తప్పకుండా ప్రజలు బుద్ది చెబుతారన్నారు. వేదశ్రీ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. హైడ్రా బాధితులందరికీ భారత రాష్ట్ర సమితి తరఫున న్యాయ సాయం అందిస్తామని ఈ సందర్భంగా కేటీఆర్ చెప్పారు.