Wednesday, February 5, 2025
HomeUncategorizedపేదల సంక్షేమం.. రాష్ట్ర అభివృద్ధి తమ ప్రభుత్వానికి రెండు కళ్లలాంటివని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి జిల్లా...

పేదల సంక్షేమం.. రాష్ట్ర అభివృద్ధి తమ ప్రభుత్వానికి రెండు కళ్లలాంటివని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సి ఏం స్పష్టత.



పేదల సంక్షేమం.. రాష్ట్ర అభివృద్ధి తమ ప్రభుత్వానికి రెండు కళ్లలాంటివని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వం పేదల కోసం పని చేస్తుందనే నమ్మకం… విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లపైనే ఉందని అన్నారు. జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికి అసలైన ప్రతినిధులని.. ప్రభుత్వానికి మంచి పేరు రావాలన్నా.. గొప్ప పేరు రావాలన్నా కలెక్టర్లే నిర్ణయాత్మక పాత్రను పోషిస్తారని ముఖ్యమంత్రి అన్నారు. ఇటీవల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల గణన సర్వేను విజయవంతంగా పూర్తి చేసినందుకు అన్ని జిల్లాల కలెక్టర్లను అభినందించారు.

ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు, అమలు చేసే పథకాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లేది కలెక్టర్లేనని.. వాని పనితీరే ప్రభుత్వ పని తీరుకు కొలమానమవుతుందని అన్నారు. కలెక్టర్లు ఎప్పటికప్పుడు తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని సూచించారు.  కొంతమంది కలెక్టర్లు ఇప్పటికీ ఆఫీసుల్లోనే కూర్చొని పని చేయాలనుకుంటున్నారని, క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళ్లాలని గతంలో చెప్పిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. సమస్యలు వచ్చినప్పుడు సమర్ధవంతంగా ఎదుర్కోవాలని అప్రమత్తం చేశారు.

జనవరి 26 తరువాత జిల్లాలో పర్యటించనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఆకస్మిక తనిఖీలు చేస్తానని, ప్రభుత్వ వ్యవస్థలో ఎక్కడ నిర్లక్ష్యం కనిపించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. క్షేత్ర స్థాయి అధికారులను కూడా అప్రమత్తం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.

మహిళా ఐఏఎస్ అధికారులతో పాటు ఐపీఎస్ అధికారులు కూడా నెలలో ఒక్కసారైనా బాలికల హాస్టల్స్ విజిట్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అక్కడే రాత్రి బస చేయాలని చెప్పారు.  విద్యార్థుల అవసరాలను, ఏమైనా సమస్యలుంటే తెలుసుకొని పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వం అందించే

సంక్షేమ ఫలాలు క్షేత్రస్థాయికి చేరేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. 

సచివాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్క, రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పాటు అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు ఈ సదస్సులో పాల్గొన్నారు.

రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు  ఇందిరమ్మ ఇండ్ల  పథకాల  అమలు, ఆయా పథకాలకు అవసరమైన వివరాల సేకరణ, లబ్దిదారుల జాబితాల తయారీపై ఈ  సమావేశంలో ప్రధానంగా చర్చించారు.

భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలైనందున ఈ  జనవరి 26న జరిగే గణతంత్ర వేడుకలకు అత్యంత ప్రాధాన్యముందని, అదే రోజున  అదే రోజున నాలుగు అత్యంత ప్రతిష్టాత్మకమైన పథకాల అమలుకు ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.

రైతు భరోసాను ఎకరానికి రూ.12 వేలకు పెంచటంతో పాటు, భూమి లేని నిరుపేద కూలీ కుటుంబాలకు రూ.12 వేల నగదు సాయం అందించే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేస్తామన్నారు.

ఏళ్లకేళ్లుగా రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డులతో పాటు గూడు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామన్నారు.

చారిత్రాత్మకమైన ఈ  పథకాలను సమర్థంగా అమలు చేయాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లపైనే ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ పథకాల అమలుకు రాష్ట్రంలోని  అన్ని గ్రామాల్లో గ్రామ సభలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డు సభల నిర్వహించాలని సూచించారు. ఈ పథకాల్లో లబ్ధిదారుల ఎంపికకు సేకరించిన వివరాలు, తయారు చేసిన జాబితాలను గ్రామసభల్లోనే వెల్లడించాలని ఆదేశించారు.

గతంలో రైతు బంధు పేరిట భారీ ఎత్తున ప్రజాధనం దుర్వినియోగం అయిందని, గత ప్రభుత్వం  వ్యవసాయ యోగ్యం కాని భూములకు పంట పెట్టుబడి సాయం అందించిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఈసారి అలాంటి పొరపాటు జరగకూడదని ముఖ్యమంత్రి హెచ్చరించారు. 

అర్హులైన రైతులందరికీ రైతు భరోసా చెల్లించాలని, అదే సమయంలో అనర్హులు ఒక్కరు కూడా లబ్ధి  పొందకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందని అన్నారు. ప్రతి జిల్లాకు, ప్రతి మండలానికో నోడల్ ఆఫీసర్లను నియమించాలన్నారు. అధికారుల బృందాలు క్షేత్ర స్థాయికి వెళ్లి అనర్హులను గుర్తించాలని చెప్పారు. ఈ సందర్భంగా పలు జిల్లాల కలెక్టర్లు లేవనెత్తిన సందేహాలను ముఖ్యమంత్రి నివృత్తి చేశారు.

వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా చెల్లించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.  వ్యవసాయానికి అక్కరకు రాని భూములను గుర్తించి, వాటిని మాత్రమే ఈ పథకం నుంచి మినహాయించాలన్నారు. రియల్ భూములు, లే అవుట్ భూములు, నాలా కన్వర్ట్ అయిన భూములు,  మైనింగ్ భూములు, గోదాములు ఫంక్షన్ హాళ్లు నిర్మించిన భూములు, వివిధ ప్రాజెక్టుల కు, అభివృద్ధి పనులకు ప్రభుత్వం సేకరించిన భూములు ఈ అనర్హత జాబితాలోకి వస్తాయని వివరించారు.

గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల రెవెన్యూ రికార్డులు, డీటీసీపీ లే అవుట్ రికార్డులు,  సంబంధిత విభాగాల రికార్డుల్లో ఉన్న వివరాల ఆధారంగా ఈ జాబితాలను తయారు చేయాలన్నారు. విలేజ్ మ్యాప్ లతో పాటు అధికారులు ఫీల్డ్ కు వెళ్లి వీటిని ధ్రువీకరించుకొని వీటిని గ్రామ సభలో ప్రచురించాలని చెప్పారు.

రైతులకు ఎలాంటి అనుమానాలు అపోహలకు తావు లేదని,  పంట వేసినా.. వేయకున్నా.. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరం భూమికి రైతు భరోసా అందుతుందని సీఎం స్పష్టత ఇచ్చారు.

భూమి లేని నిరుపేద ఉపాధి కూలీ కుటుంబాలను ఆదుకునేందుకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రారంభించినట్లు సీఎం చెప్పారు. ఆ కుటుంబానికి ఏడాదికి రూ.12 వేల నగదు సాయం అందిస్తామన్నారు. ఏడాదిలో కనీసం 20 రోజులు ఉపాధి హామీ పనులు చేసిన భూమి లేని కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు.

గతంలో ఉన్న అర్హత నిబంధనల ప్రకారమే రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామన్నారు. ఒక వ్యక్తికి ఒకేచోట రేషన్ కార్డు ఉండాలని, ఒకే వ్యక్తికి  వేర్వేరు ప్రాంతాల్లో రేషన్ కార్డులు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను సీఎం ఆదేశించారు.  రాబోయే రోజుల్లో రాష్ట్రంలో వన్ రేషన్ వన్ స్టేట్ విధానాన్ని తీసుకురాబోతున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డు లబ్ధి దారుల జాబితాలను కూడా గ్రామ సభల్లో వెల్లడించాలన్నారు.

గూడు లేని నిరుపేదలకు ఇళ్లను నిర్మించి ఇవ్వాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే ఇందిరమ్మ యాప్ ద్వారా గుర్తించిన 18.32 లక్షల మంది వివరాలను జిల్లాలకు పంపించామన్నారు. అందులో అత్యంత నిరుపేదలుగా గుర్తించిన వారికి మొదటి ప్రాధాన్యమివ్వాలని చెప్పారు.  తొలి విడత నియోజకవర్గానికి 3500 ఇండ్లను మంజూరు చేశామని, ఇందిరమ్మ ఇండ్లకు  అర్హులైన వారి జాబితాలను వెంటనే సిద్ధం చేయాలని చెప్పారు. జిల్లా ఇంచార్జ్ మంత్రుల ఆమోదంతో ఈ అర్హుల జాబితాను గ్రామసభల్లో ప్రచురించాలన్నారు.

ఈ నెల 11 నుంచి 15 లోగా ఈ పథకాల అమలుకు కావాల్సిన ప్రిపరేటరీ వర్క్ పూర్తి చేయాలని సీఎం సూచించారు. జిల్లా ఇన్ ఛార్జీ మంత్రుల సారధ్యంలో అన్ని జిల్లాల్లో కలెక్టర్లు, నోడల్ అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. 24వ తేదీలోగా గ్రామ సభలు పూర్తి చేయాలని ఆదేశించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments