*బోత్సావానా ప్రభుత్వ సలహాదారు అర్బన్ బసిమా దబుత*


*ఆర్టీజీఎస్ పనితీరు ఆదర్శనీయం*
*బోత్సావానా ప్రభుత్వ సలహాదారు అర్బన్ బసిమా దబుత*
అమరావతి: ఫిబ్రవరి 07:- (
సమయం ప్రతినిధి) ఆర్టీజీఎస్ పనితీరు ఆదర్శనీయమని ఆఫ్రికా దేశాల్లో ఒకటైన బోత్సవానా దేశ ప్రతినిధులు ప్రశంసించారు. బోత్సావాన దేశ ప్రభుత్వ సలహాదారు అర్బన్ బసిమా దబుతా శుక్రవారం సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) కేంద్రాన్ని సందర్శించారు. ఆర్టీజీఎస్ ముఖ్య కార్యనిర్వహణాధికారి కె. దినేష్ కుమార్ ఆయనకు స్వాగతం పలికి, ఆర్టీజీఎస్ పనితీరు గురించి వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనల నుంచి ఆర్టీజీఎస్ వ్యవస్థ రూపుదిద్దుకుందని, అటు ప్రభుత్వానికి, ఇటు పౌరులకు మధ్య ఈ సంస్థ ఒక వారధిగా పనిచేస్తుందన్నారు. ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న మెరుగైన సేవలు అందించడంలో ఆర్టీజీఎస్ సాంకేతిక సహకారాన్ని అందిస్తుందని చెప్పారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల మధ్య ఉన్న డేటా అనుసంధానం చేసి ఒక డేటా లేక్ ఏర్పాటు చేసి, ప్రభుత్వ సేవలను మరింత సరళతరం చేయడంలో ఈ సంస్థ దోహదపడుతోందని వివరించారు. డీప్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, డ్రోన్స్ తదితర సాంకేతి సదుపాయలన్నీ ఉపయోగించుకోవడానికి ప్రత్యేక హబ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలు ఒకే చోట అన్ని సేవలు సులభంగా పొందేలా ప్రభుత్వం ప్రజలకు వాట్సాప్ గవర్నెన్స్‌ను అందిస్తోందని చెప్పారు. ఇందులో ప్రస్తుతం 161 సేవలు అందిస్తున్నామని, తదుపరి అన్ని రకాల సేవలు ఇందులోనే పౌరులు పొందేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. బోత్సవానా ప్రభుత్వ సలహాదారు బసిమా దబుతా మాట్లాడుతూ ఆర్టీజీఎస్ పనితీరు గురించి విని తాము ఈ కేంద్రాన్ని సందర్శించి స్వయంగా దీని పని తీరు తెలుసుకోవాలని వచ్చామన్నారు. ఈ సంస్థ పనితీరు అద్భుతంగా, ఆదర్శనీయంగా ఉందని చెప్పారు. తమ దేశంలో కూడా పౌరులకు మెరుగైన సేవలందించేలా ఈ తరహా వ్యవస్థ ఏర్పాటు చేసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో ఆర్టీజీఎస్ డిప్యూటీ సీఈఓ మాధురి తదితరులు పాల్గొన్నారు.