


*పింక్ బుక్ మెయింటైన్ చేస్తున్నాం.. ఇంతకింత చెల్లిస్తాం*
*లెక్కలు ఎలా రాయాలో మాకు తెలుసు… మీ లెక్కలు తీస్తాం*
*మేం అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి చెల్లిస్తాం*
*కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది*
*పార్టీ ఫిరాయించిన వారి స్థానాల్లో ఉప ఎన్నికలొస్తే ఎగిరేది గులాబీ జెండానే*
*బీసీ బిల్లు తెచ్చి చేతులు దులుపుకుంటే కుదరదు*
*బీసీ రిజర్వేషన్ పెంపు ఆచరణ సాధ్యంకావాలి*
*విద్యా, ఉపాధి, రాజకీయ రిజర్వేషన్లకు వేర్వేరు బిల్లులు ప్రవేశపెట్టాలి*
*జనగామ జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు*
జనగామ: ఫిబ్రవరి 13 (సమయం న్యూస్)అక్రమ కేసులతో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తుండడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. “మేము పింక్ బుక్ మెయింటైన్ చేస్తున్నాం. అందులో అన్నీ రాసుకుంటాం. ఇంతకింత తిరిగి చెల్లిస్తాం. లెక్కలు ఎలా రాయాలో మాకు తెలుసు. మీ లెక్కలన్నీ తీస్తాం. అన్నింటినీ మేం అధికారంలోకి వచ్చాక తిరిగి చెల్లిస్తాం” అని కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా హెచ్చరించారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని, కాంగ్రెస్ వేధింపులకు గులాబీ సైనికులు భయపడబోరని తేల్చిచెప్పారు.
గురువారం నాడు జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ డిప్యుటీ సీఎం టీ రాజయ్యతో కలిసి ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. అంతకు ముందు పెంబర్తిలోనూ విలేకరులతో మాట్లాడారు.
ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. రైతు డిక్లరేషన్ పై నిలదీస్తారని రాహుల్ గాంధీ వరంగల్ పర్యటనను రద్దు చేసుకున్నారని విమర్శించారు. సామాజిక మాధ్యమాల్లో చిన్న విమర్శ చేసినా సీఎం రేవంత్ భయపడుతున్నారని, పోస్టు చేసిన మరుసటి నాడే ఇంటికి పోలీసులు వచ్చి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ తిరుగుతారని, కానీ తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే దగా, మోసమని స్పష్టం చేశారు.
బీసీ రిజర్వేషన్లను పెంచడానికి శాసన సభలో బిల్లు ప్రవేశపెడుతామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక డిమాండ్ చేశారు. బీసీ బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపి చేతులు దులుపుకుంటే కుదరదని, దాన్ని ఆచరణ సాధ్యం అయ్యేలా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. బీసీలకు విద్యా, ఉపాధి, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ల పెంపునకు ఒక్క బిల్లు కాకుండా మూడు వేర్వేరు బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీసీల జనాభా 46 శాతం ఉందని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో విద్యా రంగంలో ఆ వర్గానికి 46 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఒక బిల్లు పెట్టాలని, ఉద్యోగాల్లో 46 శాతం రిజర్వేషన్లకు మరొక బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, కాబట్టి ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు రాజకీయ రంగంలో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మరొక బిల్లును పెట్టాలని సూచించారు.
బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ జాగృతి, బీసీ సంఘాలు చేసిన ఉద్యమాలకు దిగొచ్చిన ప్రభుత్వం బీసీ బిల్లు పెడుతామని ప్రకటించిందని, ఇది బీసీలందరి విజయమని, ఇది తొలి విజయం మాత్రమేనని స్పష్టం చేశారు. అయితే, కాంగ్రెస్ ధోకేబాజ్ పార్టీ అని, మాటలు చెప్పి మోసం చేయడం ఆ పార్టీకి అలవాటు అని అన్నారు. బిల్లును ఆమోదించిన మరుసటినాడే దానికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేస్తేనే ఎన్నికల్లో రిజర్వేషన్లు సాధ్యమవుతాయని, కానీ జాప్యం చేసి ఇతరులు కోర్టుకు వెళ్లడానికి అవకాశం ఇచ్చి చేతులు దులుపుకోవాలని ప్రభుత్వం చూస్తున్నట్లు నిర్దిష్టమైన సమాచారం ఉందని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువంటి ఎత్తుగడలు వేస్తే సహించబోమని, బీసీలంతా కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్దిచెబుతారని హెచ్చిరంచారు.
మళ్లీ కుల సర్వేకు అవకాశం ఇస్తామని ప్రభుత్వం చెప్పిందని, కానీ 15 రోజుల కాకుండా నెల రోజుల పాటు సమయం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో 60 శాతం మంది తమ ఇళ్లకు సర్వే చేసే వారు రాలేదని అంటున్నారని, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉందని చెప్పారు. ఈ రీత్యా రీ సర్వేపై ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేయాలని, టోల్ ఫ్రీ నెంబరును విస్త్రృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పత్రికల్లో పెద్ద ఎత్తున ప్రకటనలు ఇవ్వాలని, ముఖ్యమంత్రి బొమ్మలు కాకుండా బీసీలకు ప్రయోజనం కలిగేలా ప్రచారం చేయాలని సూచన చేశారు.
కేసీఆర్ హయాంలో గ్రామాల్లో నీళ్లు పారాయి.. నిధులు పారాయని, కానీ రేవంత్ రెడ్డి పాలనలో మాత్రం గ్రామాలకు నీళ్లు, నిధులు రావడం లేదని తెలిపారు. 95 పూర్తయిన సమ్మక్క సారక్క బ్యారేజీ పనులను పూర్తి చేయలేని చేతగాని దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం అని విరుచుకుపడ్డారు. కేవలం 5 శాతం పనులను పూర్తి చేయలేని అసమర్థత కాంగ్రెస్ ప్రభుత్వానిదని విమర్శించారు. స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని అడిగారు.
అవకాశవాదం కోసమే స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీ హరి పార్టీ మారారని, కడియం శ్రీహరిని ప్రజలు క్షమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ పార్టీ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిందని, న్యాయ వ్యవస్థపై మాకు సంపూర్ణ విశ్వాసం ఉందని, కాబట్టి పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ కు అనుకూలమైన తీర్పు వస్తుందన్న నమ్మకముందని వివరించారు. ఉప ఎన్నిక వస్తే అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ జెండా ఎగరేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇక ఇచ్చిన హామీ ప్రకారం నెలకు రూ 2500 ఇవ్వకుండా, స్కూటీలు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను వేధిస్తోందని, కళ్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్ లు మాయమయ్యాయని ఎండగట్టారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మానవత్వం లేదని మండిపడ్డారు. కళ్యాణలక్ష్మీతో పాటు తులం బంగారం ఇవ్వాల్సిందని, ఆడబిడ్డలను మోసం చేసిన మహమ్మారి కాంగ్రెస్ ప్రభుత్వానికి మహిళలు బుద్ధిచెబతారని అన్నారు. విదేశీ విద్యా స్కాలర్ షిప్ నిధులు కూడా విడుదల చేయని దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడిందని, ఫీజు రియింబర్స్ మెంట్ చేయకుండా విద్యార్థులను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని అన్నారు. రైతు భరోసా పేరిట రేవంత్ రెడ్డి రైతులను మోసం చేస్తున్నారని, రుణమాఫీ అందరికీ కాలేదు.. కానీ పూర్తయిందని ప్రభుత్వ పెద్దలు గొప్పలు చెప్తున్నారని విమర్శించారు. సంక్రాంతి నుంచి సన్నబియ్యం ఇస్తామని చెప్పి ఇంకా ఇవ్వలేదని, కాంగ్రెస్ అబద్దాలను ప్రజల్లో ఎండగడుతాని తెలిపారు.
మరోవైపు, జనగామ జిల్లా పర్యటనకు విచ్చేసిన ఎమ్మెల్సీ కవిత… పెంబర్తిలో హస్తకళాకారుల సొసైటీ సభ్యులను కలిసి వారి సమస్యలను, ఇతర అంశాలను అడిగి తెలుసుకున్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలిఘటించారు. ప్రముఖ మహమ్మాయి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. స్థానిక మహిళలతో కవిత ముచ్చటించారు.
పెంబర్తి గ్రామంలో బస్ స్టాప్ ని తొలగించినట్లు స్థానికులు తన దృష్టికి తీసుకురాగా… వెంటనే ఆ గ్రామంలో బస్ స్టాప్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వన్నా ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. అలాగే, పెంబర్తి హస్తకళాకారుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని, వారు తయారు చేసే ఉత్పుత్తులకు తగిన ధర వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కళాకారుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని సూచించారు.