

మేము రాము బిడ్డో హైకోర్టు దవాఖానకు… అంటున్న న్యాయవాదులు
హైకోర్టు దవాఖానలో అసలేం జరుగుతోంది…?
హైకోర్టులో ఇటీవలి గుండెపోట్లతో హడలిపోతున్న న్యాయవాదులు
గత కొంత కాలంగా హైదరాబాద్ లోని తెలంగాణ హైకోర్టులో గుండెపోట్లతో న్యాయవాదులు బెంబేలెత్తుతున్నారు.
కొంతమంది ప్రాణాలు వదులుతుంటే మరికొంతమందిని అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రులకు తరలించాల్సి వస్తోంది. ఇటీవలి కాలంలో న్యాయవాదులు పుసునూరి వేణుగోపాలరావు, బి. వెంకటరమణ, గోవర్దన్ రెడ్డి లు గుండెపోట్లతో ప్రాణాలు విడిచారు. మరో న్యాయవాదిని అత్యవసర పరిస్థితిలో ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది.
ఇటీవల హైకోర్టులో వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాది పుసునూరి వేణుగోపాలరావుకు హఠాత్తుగా గుండెపోటు రావడంతో కోర్టులోనే కుప్పకూలి పడిపోయారు. అక్కడే ఉన్న సదరు న్యాయవాదులు సీపీఆర్ చేస్తూ హైకోర్టులోని ప్రభుత్వ డిస్పెన్సరీకి, 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. హుటాహుటిన బాధిత న్యాయవాదిని ఆస్పత్రికి తరలించాలని ప్రయత్నం చేశారు.
సమయం మించిపోతున్నా రావడం లేదంటూ ఆందోళన చెందుతున్న న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి నిరాశే ఎదురయ్యింది.
తీరిగ్గా ఘటనా స్థలానికి వచ్చిన హైకోర్టు డిస్పెన్సరి సిబ్బంది ఖాళీ చేతులతో వచ్చారు. కనీసం ఘటనా స్థలానికి మెడికల్ కిట్, ఆక్సిజన్ కిట్, లైఫ్ సేవింగ్ కిట్ లేదా అంబులెన్స్ వరకు తరలించడానికి కనీసం స్ట్రెచర్ కూడా వారు తేలేదు. వచ్చిన డిస్పెన్సరీ సిబ్బందికి సీపీఆర్ చేయడం కూడా రాకపోవడం వారి సేవా లోపాన్ని తెలియజేస్తోంది. ఇటీవలి సీపీఆర్ లో శిక్షణ పొందిన న్యాయవాదులు కొద్దిసేపు సీపీఎర్ చేసి ప్రాణాలు కాపాడగలిగారు.
ఘటనా స్థలానికి వచ్చిన డిస్పెన్సరి సిబ్బంది ఎవరికో ఫోన్లు చేసుకుంటూ కాలయాపన చేయడంతో న్యాయవాదులు ఆగ్రహోదిక్తులయ్యారు. సదరు బాధిత న్యాయవాదిని తామే ఆస్పత్రికి తరలించడానికి న్యాయవాదులు ఉపక్రమించారు. బాధిత న్యాయవాదిని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేస్తుండగా, అసలు కూర్చోవడానికి కూడా వీలుపడని ఓ కుర్చీని దిస్పెన్సరి సిబ్బంది తీసుకువచ్చారు.
కీలకమైన దశలో ఊపిరి సరిగా అందక అత్యవసర పరిస్థితిలో ఉన్న సదరు న్యాయవాది వేణుగోపాలరావును న్యాయవాదులు అతికష్టంపై ఆ కుర్చీలోనే కూర్చోబెట్టి రెండో అంతస్తులోని కోర్టు ప్రాంగణం నుంచి గ్రౌండ్ ఫ్లోర్ లోని అంబులెన్సుకు తరలించారు.
హైకోర్టు నుంచి ఆస్పత్రికి తీసుకు వెళ్తుండగా మార్గమధ్యలో సదరు న్యాయవాది వేణుగోపాలరావు తుది శ్వాస విడిచారని హైకోర్టు ప్రాంగణంలోని న్యాయవాదులకు చేదు వార్త వచ్చింది. సీనియర్ న్యాయవాది వేణుగోపాలరావును చివరి వరకూ ప్రాణాలతో కాపాడటానికి ప్రయత్నించిన న్యాయవాదులు శోకసంద్రంలో మునిగిపోయారు.
సకాలంలో ఫస్ట్ ఎయిడ్ అంది ఉంటే న్యాయవాది వేణుగోపాలరావు బతికేవాడని, హైకోర్టు డిస్పెన్సరీ సిబ్బంది ఫస్ట్ ఎయిడ్, సీపీఆర్ లో శిక్షణ లేకపోవడం, కనీస వైద్య పరికరాలు తేవకపోవడం వారి నిర్లక్ష్య ధోరణి, సేవాలోపంపై న్యాయవాదులు మండిపడుతున్నారు.
హైకోర్టు డిస్పెన్సరీ రూటే సెపరేటు?
హైకోర్టు ప్రభుత్వ డిస్పెన్సరీలో ఇద్దరు డాక్టర్లతో పాటు మరో నలుగురు సిబ్బంది ఉన్నట్టు సమాచారం. ఇక్కడి హెచ్ ఓ డీ గైనకాలజిస్ట్ అని తెలుస్తోంది. మరో డాక్టర్ ఉంటారు. ఎంతో ప్రయాసపడితే కాని దర్శన భాగ్యం కలగదు. ఆరోగ్య సమస్యలతో ఇక్కడకు వచ్చే అడ్వకేట్లతో సిబ్బంది ప్రవర్తించే తీరు వర్ణనాతీతం.
ముందుగా డిస్పెన్సరీకి వెళ్ళగానే అంబులెన్స్ డ్రైవరో, ఫార్మశిస్టో ప్రత్యక్షమవుతారు. డాక్టర్లు ప్రశ్నించినట్టు మీకేమయ్యింది, ఏం కావాలని ప్రశ్నిస్తారు. సదరు బాధ చెప్పిన తర్వాత బయట కూర్చోమని చెప్పి ఖాళీగా లోపల కూర్చున్న నర్సుకు సమాచారం అందిస్తారు.
అక్కడ నుంచే సదరు నర్సు అందరికీ వినపడేటట్టు వచ్చిన న్యాయవాదికి షుగర్ ఉందా..? బీపీ ఉందా..? దగ్గు, జలుబు, ఆయాసం, పడిశం, హార్ట్ ఎటాక్ ఇదివరకు వచ్చిందా..? థైరాయిడ్ ఉందా..? ఇత్యాది సమస్యలు ఏమున్నాయని మొహం కూడా చూడకుండానే అడుగుతారు. అక్కడనుంచే ఓ చీటీలో మందులు రాసి పంపుతారు. ఇద్దరు డాక్టర్లు ఉండే గది వరకు కూడా పోనివ్వరు. ఎంతో బతిమిలాడితే తప్ప డాక్టర్ల మొహం కూడా చూడనివ్వరు.
మరి ఎప్పుడొస్తరమ్మ అడ్వకేట్లు హైకోర్టు దవాఖానకు..?
హైకోర్టుకు ప్రతిరోజూ వేల సంఖ్యలో న్యాయవాదులు వస్తుంటారు. వీరిలో అధిక సంఖ్యలో సీనియర్ న్యాయవాదులు, మధ్యవయస్కులు, జూనియర్లు, అడ్వకేట్ క్లర్కులు ఉంటారు. వీరి యోగక్షేమాలు పట్టించుకోవలసిన బాధ్యత హైకోర్టుతో పాటు హైకోర్టు బార్ అసోసియేషన్ పై ఎంతైనా ఉంది.
హైకోర్టు అధికారులు, బార్ అసోసియేషన్ వారు తరచూ డిస్పెన్సరీ డాక్టర్లు, సిబ్బంది తీరుపై ఫిర్యాదులు వస్తే వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలి. డాక్టర్లు, సిబ్బంది అడ్వకేట్లతో కనీస మానవత్వం ప్రదర్శించాలి. గౌరవంతో మాట్లాడాలి. ఇక్కడ డిస్పెన్సరీలో పనిచేసే డాక్టర్లు, సిబ్బందికి సీపీఆర్, ఎమర్జెన్సీ ఫస్ట్ ఎయిడ్ లో శిక్షణ ఇప్పించాలి.
డాక్టర్లు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలి. చీటి రాయగానే నేరుగా డాక్టర్ల దగ్గరకు వెళ్లే సదుపాయం కల్పించాలి. అడ్వోకేట్లపై నర్సులు, ఫార్మశిస్ట్ ల పెత్తనం మానుకోవాలి. నిత్యం మందులు అందుబాటులో ఉంచాలి. హైకోర్టు లేదా డిస్పెన్సరీలో సీపీఆర్, ఎమర్జెన్సీ ఫస్ట్ ఎయిడ్ లో అడ్వకెట్లకు శిక్షణ ఇప్పించాలంటూ న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు.