HomeUncategorizedకాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ హైదరాబాద్ సెప్టెంబర్06 ( సమయం న్యూస్)...
కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ
హైదరాబాద్ సెప్టెంబర్06 ( సమయం న్యూస్) కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నియామకం అయ్యారు. ఈ మేరకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదేశాలు జారీ చేశారు. 1966లో నిజామాబాద్ జిల్లా భీమగల్ మండలం రహమత్ నగర్ లో మహేష్ కుమార్ జన్మించారు. కాంగ్రెస్ విద్యార్థి రాజకీయాల్లో చేరిన మహేష్ కుమార్ గౌడ్ ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. ఆ తరవాత 1994 అసెంబ్లీ ఎన్నికల్లో డిచ్ పల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వేర్ హౌజ్ కార్పొరేషన్ చైర్మన్ గా పని చేసిన ఆయన తర్వాత కాలంలో కాంగ్రెస్ ప్రెసిడెంట్, అధికార ప్రతినిధిగా పని చేయడంతో పాటు 2021 కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు. కాంగ్రెస్ ప్రత్యేక ఆహ్వానితుల కమిటీతో పాటు , ఇతర కీలక పార్టీ భాద్యతల్లో పని చేసిన మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తుతం ఎమ్మెల్సీ గా ఉన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి మార్పు అనివార్యమయింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఒక్కరే ఉండకూడదనే పార్టీ లైన్ ప్రకారం రేవంత్ రెడ్డి పార్టీ అధ్యక్షుడి కుర్చీ వదులుకోక తప్పలేదు. అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బరిలో ఆయనతో పాటు అదే సామాజిక వర్గానికి చెందిన మధు యాస్కీ గౌడ్, బల రామ్ నాయక్, సంపత్ కుమార్, బలమూరి వెంకట్ ఉన్నారు. అయితే వ్యహాత్మకంగా కాంగ్రెస్ అధిష్టానం మహేష్ కుమార్ గౌడ్ ను ఎంపిక చేసింది. రాష్ట్ర సీఎం రెడ్డి సామాజిక వర్గం కాగా, ఉప ముఖ్యమంత్రి ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఉన్నారు. ఇక రాష్ట్ర జనాభాలో 53 శాతం ఉన్న బీసీలకు ప్రాతినిధ్యం ఉండేలా రాష్ట్ర అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ కు అవకాశం కల్పించింది. గతంలో 2004లో వై యస్ రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్నపుడు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన డి. శ్రీనివాస్ ను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి లు ముఖ్యమంత్రి లుగా పని చేసిన రోజుల్లో వరుసగా బొత్స సత్యనారాయణ, పొన్నాల లక్ష్మయ్య పార్టీ అధ్యక్షులుగా పని చేశారు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అవకాశం వచ్చినా.. సామజిక వర్గాల బ్యాలన్సింగ్ తో పదవులను భర్తీ చేస్తున్న సాంప్రదాయాన్ని ఈ సారి కూడా కొనసాగించినట్టు కనిపిస్తోంది.