చెరువులు, కుంటలు, నాలాల్లోని అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసి తీరుతామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో నిర్మాణాలను క్రమబద్ధం చేసే ప్రసక్తే లేదన్నారు. ఆక్రమణదారులు స్వచ్చందంగా వైదొలగాలని పిలుపునిచ్చారు. అవసరమైన పక్షంలో ఆక్రమణ దారులను జైలుకు పంపేందుకు కూడా వెనకాడబోమని హెచ్చరించారు.
రాజా బహదూర్ వెంకట్రామారెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీలో ఎస్‌ఐలు, ఏఎస్‌ఐల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు పాల్గొని ప్రసంగించారు. యువత, నిరుద్యోగ సమస్య, ఉద్యోగ నియామకాలు, డ్రగ్స్ నియంత్రణ, పోలీసింగ్, హైడ్రా, రుణమాఫీ వంటి పలు కీలక అంశాలపై మాట్లాడారు.
🔹 వరదల కారణంగా పేదల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. ఆక్రమణల కారణంగానే వరదలు వస్తున్నాయి. ఆక్రమణలను తొలగించి మూసీ నది ప్రక్షాళన చేస్తాం. పరీవాహక ప్రాంతంలోని 11 వేలకు పైగా నిర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుంది.
🔹 మనకు కాస్మెటిక్ పోలీసింగ్ కాదు. కాంక్రీట్ పోలీసింగ్ అవసరం. ఫ్రెండ్లీ పోలీసింగ్ బాధితులకు మాత్రమే, నేరస్తులకు కాదు. ఖాకీ డ్రెస్ ఉన్నది ప్రజల కోసమే అనే విశ్వాసం కల్పించేలా కొత్తగా ఉద్యోగాల్లో చేరిన ఎస్సైలు, ఏఎస్ఐలు పని చేయాలి. పోలీసుల పిల్లల కోసం హైదరాబాద్, వరంగల్‌లో ఒక్కోచోట 50 ఎకరాల్లో రెసిడెన్షియల్స్ ను రెండేళ్లలో అందుబాటులోకి తెస్తామన్నారు.
🔹 మా ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధి కోసం పెట్టుబడులు తీసుకురావడమే కాదు, రైతన్నలు, నేతన్నలు, గీతన్నలను ఆదుకుంటోంది. కేవలం 28 రోజుల్లోనే 22,22,685 రైతుల ఖాతాల్లో రూ. 18 వేల కోట్లు జమచేసి రుణమాఫీ చేశాం.
తొమ్మిదేండ్లుగా నెరవేరని నిరుద్యోగ యువత ఆకాంక్షలను మా ప్రభుత్వం సాకారం చేస్తోంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేసి భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపట్టాం. ఇప్పుడు యువకులు ఉత్సాహంతో పరీక్షలకు సిద్ధం అవుతున్నారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నాం.