Saturday, December 14, 2024
HomeUncategorizedబి సి రిజర్వేషన్లకై తమిళ తరహా లో పోరాటం. చెన్నై లో బి సి సంక్షేమ...

బి సి రిజర్వేషన్లకై తమిళ తరహా లో పోరాటం. చెన్నై లో బి సి సంక్షేమ శాఖ ఉన్నతాధకారులతో బిఆర్ యస్ బి సి నేతల బృందం.




*బీసీ రిజర్వేషన్లకై తమిళతరహాలో పోరాటం*

*చెన్నైలో బీసీ సంక్షేమశాఖ ఉన్నతాధికారులతో బీఆర్ఎస్ నేతల బృందం భేటి*

*తమిళ తరహాలో రిజర్వేషన్ల సాధనకై పోరాటం:బీఆర్ఎస్ బీసీ నేతల బృందం*

తమిళనాడు తరహాలో విద్యా ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్లు సాధించేందుకు బీఆర్ఎస్ తన పోరాటాన్నికొనసాగించి తీరుతుందని బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఛైర్మన్లు తెలిపారు. సమాజంలో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించి వారిని అన్ని రంగాల్లో ముందుకు నడిపించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని, అందుకోసం తుదిదాకా పోరాటం చేస్తామని చెప్పారు. బలహీన వర్గాల రిజర్వేషన్లు వారి అభివృద్ధి, సంక్షేమం కోసం తమిళనాడు రాష్ట్రంలో అమలవుతున్న కార్యక్రమాల అధ్యయనం, తమిళ పార్టీలలో బహుజన వర్గాల ప్రాతినిథ్యం వంటి పలు అంశాలను అధ్యయనం చేసేందుకు భారత రాష్ట్ర సమితి బిసి సీనియర్ నేతల బృందం తమిళనాడులో పర్యటిస్తున్నది.  గురువారం నాడు చెన్నైలో బీసీ సంక్షేమశాఖ ఉన్నతాధికారులతో బీఆర్ఎస్ బీసీ నేత బృందం నేతలు తమిళనాడు బీసీ భవన్ లో నాలుగు గంటల పాటు సమావేశమై రాష్ట్రంలో రిజర్వేషన్లు, బీసీ అభివృద్ధి పథకాలకు సంబంధించిన తీరుతెన్నులను సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వ బీసీ వెల్ఫేర్ ముఖ్య కార్యదర్శి విజయకుమార్ ఆధ్వర్యంలో  బీసీ సంక్షేమశాఖ అధికారుల బృందం బీసీ రిజర్వేషన్లపై పవర్ పాయింట్ ప్రెజంటేషన్ తో సమగ్ర సమాచారాన్ని బీఆర్ఎస్ బృందానికి వివరించారు.


మద్రాసు ప్రెసిడెన్సీ కాలం నుంచి నేటిదాకా రాష్ట్రంలో అమలవుతున్న బీసీ రిజర్వేషన్లు వాటి వెనుక జరిగిన సామాజిక న్యాయపరమైన అంశాలన్నింటిని బీఆర్ఎస్ నేతలకు వివరించారు. తమిళనాడు రాష్ట్రంలో ప్రభుత్వాలు బీసీ రిజర్వేషన్ల అంశంలో సామాజిక న్యాయ దృక్పథంతో  ఎప్పటికప్పుడు పటిష్టమైన చర్యలు ఏవిధంగా చేపట్టారో తెలిపారు. ఇంద్రాసాహ్ని కేసు తీర్పు దరిమిలా వెనువెంటనే స్పందించిన రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక రిజర్వేషన్ల చట్టాన్ని చేసిందని పేర్కొన్నారు. దాంతోపాటు న్యాయపర వివాదాల నుంచి రక్షణ కోసం ఆనాటి కేంద్రంతో పోరాడి, రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్ లో చేర్చి బీసీ రిజర్వేషన్లను సాధించుకున్న తీరును చెప్పారు. ఇప్పుడమలవుతున్న బీసీ రిజర్వేషన్ల కోసం జస్టిస్ అంబాశంకర్ కమిషన్ ద్వారా శాస్త్రీయంగా ఇంటింటి సమగ్ర సర్వే నిర్వహించి ఆ వర్గాలకు చెందిన విద్యా ఉద్యోగ రంగాలలో  స్పష్టమైన లెక్కలను సేకరించి పొందుపరిచారన్నారు. కాగా, చట్టసభలు, స్థానిక సంస్థల రిజర్వేషన్లపై బీఆర్ఎస్ నేతలు వివరాలు కోరగా వీటిలో రిజర్వేషన్లు లేకపోయినా సామాజిక చైతన్యంతో, తమిళ అస్తిత్వంతో 90 శాతానికి పైగా స్థానాలను బీసీ, ఎస్సీ, ఎస్టీలు గెలిచి ప్రాతినిథ్యం వహిస్తున్నారని వివరించారు. బీఆర్ఎస్ నాయకులు వెలిబుచ్చిన పలు సందేహాలకు తమిళనాడు అధికారులు పూర్తి వివరాలతో సమాచారం అందించారు.

*తమిళ తరహాలో రిజర్వేషన్ల సాధనకై పోరాటం: సిరికొండ మధుసూదనాచారి*

తెలంగాణ రాష్ట్రంలో విద్యాఉద్యోగాలలో బీసీలకు రిజర్వేషన్లు సాధించాలంటే తమిళనాడు తరహా రిజర్వేషన్లు ఒక్కటే అంతిమ పరిష్కార మార్గమని, కేసీఆర్ ఎప్పుడో స్పష్టం చేశారని బీఆర్ఎస్ నేత శాసనమండలిలో విపక్ష నాయకుడు సిరికొండ మధుసూదనాచారి అన్నారు. తమిళనాడు బీసీ సంక్షేమ శాఖ అధికారులతో సమావేశం ముగిశాక చెన్నై బీసీ భవన్ ఆవరణలో ఆయన మాట్లాడుతూ  కేసీఆర్ తన పదేళ్ళ పాలనలో పలు సందర్భాల్లో తమిళనాడు తరహా రిజర్వేషన్లు తమ రాష్ట్రానికి అమలు పరచాలని ప్రధాని మోడీని కోరారన్నారు. తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాలలో కూడా రిజర్వేషన్లను అమలు జరుపుకునే హక్కును రాష్ట్రాలకు కల్పించాలని కేంద్రాన్ని కేసీఆర్ డిమాండ్ చేశారని సిరికొండ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

రాజ్యసభలో బీఆర్ఎస్ పక్ష నాయకుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు వి. శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, జోగు రామన్నలు మాట్లాడుతు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు విద్యాఉద్యోగాల్లోనే కాకుండా స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం అమలు జరిపేదాకా బీఆర్ఎస్ పోరాడుతుందన్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు తమిళనాడు రాష్ట్రంలో అమలవుతున్న రిజర్వేషన్లు అభివృద్ధి పథకాలపై అధ్యయనం చేస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ శాసన మండలి ఛైర్మన్ స్వామి గౌడ్,ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్వర్లు, మాజీ ఎం.పీ. బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, పుట్టమధు, కోరుకంటి చందర్, మాజీ చైర్మన్లు జూలూరు గౌరీశంకర్, డా. ఆంజనేయగౌడ్, పల్లె రవికుమార్, తుల ఉమ, గెల్లు శ్రీనివాస యాదవ్, నాగేందర్ గౌడ్, రవీంద్రసింగ్, బాలరాజు యాదవ్, మాజీ బీసీ కమిషన్ సభ్యులు సుభప్రద పటేల్, కిశోర్ గౌడ్, బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రీనివాస్, చెరుకు సుధాకర్, రాజ్యలక్ష్మి, బీసీ జనసభ అధ్యక్షులు రాజారాం యాదవ్, విద్యార్థి సంఘం నేత దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు.

*ఐలమ్మకు నివాళులు*

తెలంగాణ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్య వర్ధంతి సందర్భంగా చెన్నైలో బీఆర్ఎస్ నేతలు పలువురు మాజీ మంత్రులు, మాజీ చైర్మన్లు, శాసనసభ్యులు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments