*_మేనల్లుడు లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పడమే ఆమెకు శాపమైంది…_*
*_మేనల్లుడు తనను లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పడమే ఆమె పాపమైంది. ఆమెపై విచక్షణ రహితంగా దాడిచేసి శిరోముండనం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదికాస్తా పోలీసులకు చేరడంతో మహిళ భర్త సహా ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 3న ఈ ఘటన జరిగినప్పటికీ వీడియో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధిత మహిళకు గుండు గీసి, కాళ్లుచేతులు కట్టేయడం వీడియోలో కనిపించింది. గుమికూడిన జనం ముందే భర్త ఆమెను కర్రతో చావబాదాడు. బాధతో విలవిల్లాడుతున్న ఆమెపై నిందితులు వంతుల వారీగా దాడిచేశారు._*
*_మేనల్లుడు రాజనాథ కొంతకాలంగా తనను లైంగికంగా వేధిస్తున్నాడని బాధిత మహిళ ఆరోపించింది. ఈ విషయం చెప్పినందుకు భర్త, ఆయన కుటుంబ సభ్యులు ఆగ్రహంతో ఊగిపోతూ ఆమెకు శిరోముండనం చేయించి కర్రలతో చావగొట్టారు. వీడియో పోలీసులకు చేరడంతో వారు వెంటనే స్పందించారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి భర్త సహా ఆరుగురిని అరెస్ట్ చేశామని, తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు._*